అహ్మదాబాద్, జనవరి 6: అత్త అంత్యక్రియలకు వెళ్లకుండా ప్రధాని మోదీ భార్య జశోదాబెన్ను గుజరాత్ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచినట్టు డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ టీఎన్ఎఫ్ టుడే తెలిసింది. మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమెకు నివాళులర్పించేందుకు సోదరుడితో కలిసి వాద్నగర్ వెళ్లేందుకు జశోదాబెన్ బయలుదేరగా, గుజరాత్ పోలీసులు అడ్డుకుని, హౌజ్ అరెస్ట్ చేసినట్టు టీఎన్ఎఫ్ టుడే వెల్లడించింది. దీనిపై జశోదాబెన్ను టీఎన్ఎఫ్ సంప్రదించగా.. ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. గాంధీనగర్, మెహ్సానా, ఉంఝా పోలీస్స్టేషన్లకు చెందిన పోలీసులు ఇక్కడకు వచ్చారని, తనను వెళ్లకుండా అడ్డుకున్నారని ఆమె చెప్పారు. ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించగా.. తమకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పారని వివరించారు. ఈ ఘటన తనను ఎంత గానో కలిచివేసిందని తెలిపారు.