Prashant Kishor : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) వేళ జన్ సురాజ్ పార్టీ (Jan Suraaj Party) అధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ మరో 65 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితా (Second list) ను విడుదల చేశారు. అయితే ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది.
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్పై బరిలో దిగనున్న రాఘోపూర్ నుంచి పోటీ చేస్తానని గతంలో పీకే ప్రకటించారు. అయితే ఇప్పటికే తన పార్టీ అభ్యర్థులతో రెండు జాబితాలు ప్రకటించిన ఆయన.. రాఘోపూర్ స్థానాన్ని మాత్రం ఇంకా ఏ జాబితాలో పెట్టలేదు. దాంతో ఆయన రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు తెరలేపారు. ‘పీకే నిజంగా రాఘోపూర్ నుంచి బరిలో దిగుతారా..? లేదంటే అది ఆయన ఎన్నికల వ్యూహంలో భాగమా..? అని పలువురు చర్చించుకుంటున్నారు.
జన్ సురాజ్ పార్టీ ఈరోజు 65 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తూ, అన్ని వర్గాలకు అవకాశం కల్పించినట్లు పార్టీ వెల్లడించింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న హర్నాట్ స్థానం నుంచి కమలేశ్ పాశ్వాన్ అనే ఎస్సీ అభ్యర్థిని బరిలోకి దింపింది. ఈ సందర్భంగా పీకే మాట్లాడుతూ.. రెండో జాబితాతో కలిపి ఇప్పటివరకు మొత్తం 116 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు తెలిపారు.
తొలి జాబితాలో 51 మందిని, ఇప్పుడు 65 మందిని ప్రకటించామని, మిగిలిన స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. బీహార్లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈసారి అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి, జన్ సురాజ్ పార్టీ మధ్య త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది.