Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద సానుభూతిపరులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్, కిష్ట్వారా జిల్లాలోని, దచ్చన్ ఏరియాలో పోలీసులు, భద్రతా బలగాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యాంటీ టెర్రర్ ఆపరేషన్ నిర్వహించారు. అనేక ప్రాంతాలో సోదాలు నిర్వహించారు. నిఘా పెంచారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు సాయమందిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒక ప్రభుత్య ఉద్యోగి కూడా ఉన్నాడు.
నిందితులను తారిక్ అహ్మద్ గిను, మొహమ్మద్ ఇక్బాల్గా గుర్తించారు. వీరిలో తారిక్ అహ్మద్ గిను అటవీ శాఖలో పని చేస్తున్నాడు. ఈ అంశంపై స్థానిక సీనియర్ ఎస్పీ నరేష్ సింగ్ వివరాలు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. అరెస్టైన ఇద్దరు నిందితులు తీవ్రవాదులకు సహకరించారు. వారు తీవ్రవాదులకు రవాణాలో సాయం చేయడం, నిర్వహణ పరమైన సాయం, తీవ్రవాద కార్యకలాపాలలో సాయపడటం చేశారు. తీవ్రవాదులు అక్కడ ఉండేందుకు, నెట్వర్క్ విస్తరించేందుకు తోడ్పడ్డారు. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నెట్వర్క్తో సంబంధం ఉన్న ఇతరుల వివరాలపై, వారి కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు. వారిని గుర్తించే పనిలో ఉన్నారు.
ఇంతకుముందు కూడా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులకు సాయం చేశారనే అంశంపైనే మునీర్ అహ్మద్, మష్కూర్ అహ్మద్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని పోలీసులు తెలిపారు. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని, తీవ్రవాదులకు సహకరించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.