జమ్మూ: జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాక్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు సీఎం ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) తెలిపారు. పూంచ్, రాజౌరి, జమ్మూ, బారాముల్లా సెక్టార్లలో గత నాలుగు రోజుల్లో జిల్లా డెవలప్మెంట్ ఆఫీసర్‌తో పాటు మరో 18 మంది గ్రామస్తులు మృతిచెందారు. పూంచ్ జిల్లాలో బుధవారం 12 మంది సాధారణ పౌరులు మరణించారు. శుక్రవారం పూంచ్, ఉరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో అయిదుగురు పౌరులు, సీనియర్ ప్రభుత్వ ఆఫీసర్ చనిపోయారు. పాకిస్థాన్ జరుపుతున్న షెల్లింగ్ వల్ల అమాయకులు మృతిచెందడం తీవ్ర బాధను కలిగిస్తున్నదని, ప్రజల సమస్యలను తగ్గించేందుకు వీలైనన్ని చర్యలు తమ ప్రభుత్వం తీసుకుంటోందని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు.