Gmail-WhatsApp Ban | సున్నితమైన అధికారిక దస్త్రాలను వాట్సాప్, జీమెయిల్ వంటి థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించకుండా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి డేటా లీక్, భద్రతా ఉల్లంఘనలు పెరిగే ప్రమాదం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది. వాట్సాప్, జీమెయిల్ వంటి యాప్స్ సున్నితమైన, రహస్య డేటాను నిర్వహించేందుకు వీలుగా రూపొందించలేదని స్పష్టం చేసింది. ఆయా వ్యవస్థలు ప్రభుత్వ కమ్యూనికేషన్‌కు అవసరమైన కఠినమైన ప్రమాణాలకు అనుగుణంగా లేవని పేర్కొంది.
అధికారులు, ఉద్యోగులు థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్‌లను వినియోగిస్తున్న తీరు పాలనా యంత్రాంగం దృష్టికి వచ్చిందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కీలకమైన సమాచారం బయటపడితే భద్రత, సమగ్రతకు తీవ్రమైన ముప్పు కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. థర్డ్ పార్టీ టూల్స్‌తో సున్నితమైన, గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని పంపిన సందర్భంలో అనధికారిక యాక్సెస్, డేటా లీక్, భద్రతా ఉల్లంఘనలు తదితర అనేక సమస్యలకు దారి తీయవచ్చని పేర్కొంది. సున్నితమైన సమాచారాన్ని నాలుగు కేటగిరిలుగా విభజించారు. టాప్ సీక్రెట్, సీక్రెట్, కాన్ఫిడెన్షియల్, రిస్టిక్టెడ్గా విభజించింది.
టాప్ సీక్రెట్, సీక్రెట్ డాక్యుమెంట్స్ ఇంటర్నెట్ ద్వారా షేర్ చేయరు. కేవలం ఎస్ఏజీ గ్రేడ్ ఎన్క్రిప్షన్తో క్లోజ్డ్ నెట్వర్క్ ద్వారా మాత్రమే సంబంధిత సమాచారాన్ని పంపనున్నారు. ప్రభుత్వ ఈమెయిల్స్, ప్రభుత్వ ఇన్స్టంట్ మెస్సేజింగ్ ప్లాట్‌ఫామ్(C-DAC, NIC Sandesh)ల కాన్ఫిడెన్షియల్, పరిమితమైన సమాచారాన్ని పంపేందుకు ఉపయోగాలని ప్రభుత్వం సూచించింది. ఈ-ఆఫీస్ వ్యవస్థలో సరైన ఫైర్‌వాల్, వైట్‌లిస్ట్ చేయబడిన ఐపీ అడ్రెస్‌లను ఉపయోగించాలని ఆదేశించింది. రహస్య డేటాపై చర్చిస్తున్న సమయంలో అమెజాన్ ఎకో, యాపిల్ హోమ్‌పాడ్, గూగుల్ హోమ్ మొదలైన డిజిటల్ అసిస్టెంట్ డివైజ్‌లకు దూరంగా ఉండాలని చెప్పింది.