న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: జమిలి ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు, ఒక సాధారణ బిల్లును తీసుకురానుంది. ప్రతిపాదిత మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ, శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి సంబంధించింది. ఇందుకోసం 82ఎ, 83(2) అధికరణలకు సవరణలు చేయాల్సి ఉంటుంది.
327 అధికరణకు సవరణ చేసి ‘ఏక కాల ఎన్నికలు’ అనే పదాన్ని పొందుపరచాల్సి ఉంటుంది. రాష్ర్టాల వ్యవహారాలకు సంబంధించిన ప్రతిపాదిత రెండో రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు పురపాలికలు, పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిబంధనలకు సంబంధించినది. మూడో బిల్లు శాసనసభలు కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇతర రాష్ర్టాల అసెంబ్లీలు, లోక్సభకు పేర్కొన్న విధంగానే నిబంధనలను సరి చేయడానికి సంబంధించినది.