Jaipur : రాజస్తాన్ రాజధాని జైపూర్లో అధికారులు అక్రమ కట్టడాల్ని కూల్చివేస్తున్నారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా జైపూర్ డెవలప్మెంట్ అథారిటీ(జేడీఏ) అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా డివిజనల్ ఆఫీసర్ వి శరవణ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
రెండు రోజులపాటు జైపూర్ పరిధిలోని రూరల్, అర్బన్ ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు, ఎస్ఎంఎస్ సేవలు నిలిపివేయనున్నారు. జూన్ 7 అర్ధరాత్రి 12 గంటల నుంచి జూన్ 8 అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణ, అల్లర్లకు తావు లేకుండా ఉండాలని ప్రభుత్వ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.2జీ, 3జీ, 4జీ, 5జీ మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్, ఎంఎంఎస్ సేవలు నిలిచిపోనున్నాయి.ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్ వంటి సోషల్ మీడియా సర్వీసులు కూడా ఆగిపోతాయి. అసత్య ప్రచారాలు, తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే అంశాలు వంటివి ప్రచారం కాకుండా ఉండటానికి తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.
జైపూర్ నగరంలోని అనేక పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ నిషేధం అమలవుతోంది. సస్పెన్షన్ ఆఫ్ టెలికాం సర్వీసెస్ (పబ్లిక్ ఎమర్జెన్సీ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ) రూల్స్ 2017 ప్రకారం ఈ రూల్ అమలు చేస్తున్నారు. దీనిద్వారా ప్రజా సంక్షేమం కోసం ఈ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంది. తాత్కాలిక సేవల నిలిపివేతకు అనుగుణంగా ప్రజలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.