సిమ్లా : మినీ స్కర్టులు, షార్ట్స్ వంటి పొట్టి దుస్తులు ధరించి ఆలయంలోకి భక్తులు ప్రవేశించడాన్ని సిమ్లాలోని వందేండ్ల చరిత్ర కలిగిన జైన్ ఆలయం (Jain temple) నిషేధించింది. క్రమశిక్షణ, హిందూ సంస్కృతి, విలువలను కాపాడే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆలయ అధికారులు తమ చర్యను సమర్ధించుకున్నారు. పొట్టి దుస్తుల్లో ఆలయంలోకి భక్తులను అనుమతించబోమని పేర్కొంటూ ఆలయం వెలుపల న్యూ డ్రెస్ కోడ్ను సూచిస్తూ నోటీసు అతికించారు.
శ్రీ దిగంబర్ జైన్ సభ ఈ ఆలయాన్ని నిర్వహిస్తోంది. ఆలయాన్ని దర్శించే మహిళలు, పురుషులందరూ హుందాతనం ఉట్టిపడే దుస్తులు ధరించాలని పొట్టి దుస్తుల్లో ఆలయంలోకి ప్రవేశించడం నిషేధించామని నోటీసులో పొందుపరిచారు. పొట్టి దుస్తులు, హాఫ్ ప్యాంట్స్, బెర్ముడాలు, మినీ స్కర్టులు, నైట్ సూట్, టార్న్ జీన్స్, ఫ్రాక్, త్రీ క్వార్టర్ జీన్స్ వంటి దుస్తులతో వచ్చే భక్తులను ఆలయంలోకి అనుమతించమని నోటీసులో స్పష్టం చేశారు. ఫ్యాషన్లలో మార్పులు, హిందూ సమాజంలో చోటుచేసుకుంటున్న నూతన పోకడల నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని జైన్ ఆలయ పూజారి వెల్లడించారు.
ఆలయాన్ని సందర్శించే భక్తులంతా నిర్ధేశించిన డ్రెస్ కోడ్ను పాటించాలని ఆలయ పూజారి సంజయ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. గతంలో పెద్దవారు చక్కటి దుస్తుల్లో ఆలయాలకు వచ్చే వారని, కానీ ఇప్పుడు యువతీ యువకులు, మహిళలు సైతం పొట్టి దుస్తులతో ఆలయాలకు వస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాశ్చాత్య అలవాట్లు, సంస్కృతి ప్రభావంతో మన మత విశ్వాసాలు, విలువలు నిర్వీర్యం అవుతున్నాయని జైన్ పేర్కొన్నారు.
Read More :