న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రభుత్వ విధి నిర్వహణలో సుప్రీంకోర్టు జోక్యాన్ని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ మరోసారి ప్రశ్నించారు. పార్లమెంటే సుప్రీం అని ప్రకటించిన ఆయన.. ప్రజా ప్రతినిధులే (పార్లమెంట్ సభ్యులు) రాజ్యాంగ పరిరక్షకులని, వారిని శాసించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ధన్‌ఖడ్ ప్రసంగిస్తూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తాను మాట్లాడే ప్రతి మాట దేశ ప్రయోజనాలను ఆశించేనని చెప్పారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు.
ఎమర్జెన్సీలో మీ పాత్ర ఏమిటి?
రాజ్యాంగ పీఠికకు సంబంధించి గతంలో ఇచ్చిన రెండు పరస్పర భిన్నమైన తీర్పులపై సుప్రీంకోర్టుపై ఎదురైన బహిరంగ విమర్శలను ధన్‌ఖడ్ ప్రస్తావించారు. 1967లో ఐసీ గోలక్‌నాథ్ కేసు, 1973లో కేశవానంద భారతి కేసును ఆయన గుర్తు చేస్తూ 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెనీ విధించిన సందర్భంగా ఆనాటి సుప్రీంకోర్టు పాత్రను కూడా ప్రశ్నించారు. ఎమర్జెన్సీ విధింపుపై తొమ్మిది హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు కొట్టివేసిందని ఆయన చెప్పారు. ఎమర్జెన్సీని, ప్రాథమిక హక్కుల రద్దును ప్రజస్వామిక చరిత్రలో చీకటి దశగా ఆయన అభివర్ణించారు.
తొమ్మిది హైకోర్టులు ఇచ్చిన తీర్పులను దేశంలోని అత్యున్నత న్యాయస్థానం విస్మరించినందుకే తాను చీకటి దశగా పేర్కొన్నానని ఆయన చెప్పారు. ప్రాథమిక హక్కుల నిలుపుదల జరిగినపుడు దాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని ఉప రాష్ట్రపతి తెలిపారు. ఎమర్జెన్సీ విధించిన అప్పటి ప్రధాన మంత్రిని(ఇందిరా గాంధీని ప్రస్తావిస్తూ) 1977లో జవాబుదారీ చేశారని, ఆ తర్వాత ఎన్నికల్లో ఆమె ఓడిపోయారని ఆయన చెప్పారు. ప్రజల కోసమే రాజ్యాంగం ఉందని, దాన్ని పరిరక్షించే బాధ్యత పార్లమెంట్‌కే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.