చెన్నై: తమిళనాడులో ప్రతిపక్షమైన డీఎంకేకు మిత్రపక్షాలు వరుసగా షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన రాజకీయ బంధానికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ముగింపు పలికింది. డీఎంకే నేతృత్వంలోని కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. (IUML Parts Ways With DMK) తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే భారీ విజయం సాధించడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించింది. దీంతో పలు పార్టీలు తమ వ్యూహాలను, పొత్తులను మార్చుకున్నాయి.
కాగా, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమితో కలిసి పోటీ చేసిన ఐయూఎంఎల్ రెండు స్థానాలు గెలుచుకున్నది. అయితే, ఎన్నికల అనంతరం సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి ఆ పార్టీ మద్దతు ఇచ్చింది. అధికార కూటమిలో చేరడంతో పాటు, రాష్ట్ర మంత్రివర్గంలోనూ ప్రాతినిధ్యాన్ని దక్కించుకుంది.
మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో డీఎంకే కూటమిని వీడటంపై రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో ఐయూఎంఎల్ నిర్ణయం తీసుకున్నది. డీఎంకేతో 60 ఏళ్ల రాజకీయ బంధాన్ని తెంచుకుంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఐయూఎంఎల్ జాతీయ అధ్యక్షుడు కె.ఎం. ఖాదర్ మొహిదీన్ ఈ విషయాన్ని వెల్లడించారు. తమ పార్టీ దాదాపు 60 ఏళ్లుగా డీఎంకే నేతృత్వంలోని కూటమితో కలిసి ప్రయాణించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రతినిధులుగా ప్రాతినిధ్యాన్ని పొందినట్లు చెప్పారు.
అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయని, అందుకే డీఎంకేను వీడినట్లు ఖాదర్ మొహిదీన్ స్పష్టం చేశారు. ‘ద్రవిడ తరహా పాలన కొనసాగుతుందని మేం ఆశించాం. కానీ ప్రజల తీర్పు భిన్నంగా ఉన్నది. టీవీకేకు సంపూర్ణ మెజారిటీ లభించనప్పుడు, రాజకీయ స్థిరత్వాన్ని కాపాడటానికి, తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితిని నివారించడానికి ఐయూఎంఎల్ మద్దతు ప్రకటించింది’ అని ఆయన అన్నారు.