బెంగళూరు: కర్ణాటకలో PayCM పోస్టర్ వివాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. తనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేస్తున్నవి తప్పుడు ఆరోపణలని ఆయన విమర్శించారు. వాళ్లు చేసిన ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాధారాలను చూపించలేకపోయారని బొమ్మై మండిపడ్డారు. ఇదంతా పక్కా ప్రణాళికతో చేస్తున్న రాజకీయ దుష్ప్రచారమని కొట్టిపారేశారు.
కాంగ్రెస్ హయాంలో కర్ణాటకలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, వాటన్నింటిపై దర్యాప్తు జరుగాల్సి ఉన్నదని బసవరాజ్ బొమ్మై చెప్పారు. PayCM క్యూఆర్ కోడ్‌తో ఉన్న పోస్టర్లు గిట్టనివాళ్లు దురుద్దేశంతో రూపొందించినవని ఆరోపించారు. ఇటీవల కర్ణాటకలో గోడలపై PayCM క్యూఆర్ కోడ్‌తో ఉన్న పోస్టర్లు దర్శనమిచ్చాయి.
దాంతో రాష్ట్రంలోని బీజేపీ సర్కారు బాహాటంగా వసూళ్లకు పాల్పడుతున్నదని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. కాంగ్రెస్ ఆరోపణలను అధికార బీజేపీ కొట్టిపారేస్తున్నది.