Amarnath Floods | జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్ పరిసరాల్లో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మంది వరకు గల్లంతయ్యారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఐటీబీపీ పేర్కొంది. కొండ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా నీటి ప్రవాహం వచ్చిందని ఐటీబీపీ పీఆర్వో తెలిపారు. బలగాలు అప్రత్తమై యాత్రికులను రక్షించేందుకు చర్యలు చేపట్టాయన్నారు.
టెంట్ల నుంచి 10-15 నిమిషాల్లో యాత్రికులను తరలించామని, వరదల్లో చాలా గుడారాలు కొట్టుకుపోయాయని పీఆర్వో పేర్కొన్నారు. నదిలో కొట్టుకుపోతున్న కొందరిని రక్షించామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. వరద బాధితులకు ఆహారం, వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అమర్నాథ్లో వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయని, అవసరమైతే రాత్రి కూడా సహాయ చర్యలు చేపడుతామని వివరించారు. వరదల దృష్ట్యా అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేశామని, వాతావరణం అనుకూలిస్తే రేపే యాత్ర పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.