న్యూఢిల్లీ, జనవరి 20: పాతికేండ్ల వయసులో ఏదైనా ఉద్యోగంలో చేరే వ్యక్తి 40వ పడిలోకి వచ్చేసరికి ఆ రంగంలో విశేష అనుభవం గడించినవారై ఉంటారు. నాయకత్వ స్థానంలోకి ఎదిగి ఒక టీమ్ నడిపించే స్థితికి చేరుకుంటారు. కెరియర్ పీక్ దశలో ఉండే ఈ సమయంలో తన రంగానికి సంబంధించి ఇతరులను ప్రభావితం చేయగల సమర్థులై ఉంటారు. కానీ మారుతున్న కాలంలో నేటి ఆధునిక కార్పొరేట్ రంగంలో ఈ మధ్య వయస్కులకు క్రమంగా డిమాండ్ తగ్గుతున్నది.
నిజానికి చాలా సంస్థలు వీరిని వదిలించుకొనేందుకు ప్రయత్నిస్తుండగా, ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారిని చేర్చుకొనేందుకు ఇతర సంస్థలు నిరాకరిస్తున్నాయి. వీరి అనుభవం, నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిన్నటి వరకూ ద్వారాలు తెరిచిన సంస్థలు ఇప్పుడు వారు కనపడగానే మూసివేస్తున్నాయి. వారి అనుభవం, నైపుణ్యం ఖరీదైనదిగా భావిస్తున్నాయి. వేగం, సృజనాత్మకత, యువరక్తానికి ప్రాధాన్యమిస్తున్న నేటి ఆర్థిక వ్యవస్థలో 40 ఏండ్ల వారిని భారంగా చూస్తున్నాయి. ఓ వైపు అనుభవజ్ఞులను ప్రశంసిస్తూనే మరోవైపు వారిని ప్రోత్సహించేందుకు వెనుకాడుతున్నాయి. దీంతో 40 ఏండ్లు దాటిన వారు ఉపాధి లేక రోడ్లపైకి వస్తున్నారు.
ఉద్యోగ వేటలో మధ్య వయస్కులు
దాదాపు అన్ని రంగాల్లో నిపుణులైన మధ్య వయస్కులు తాము పనిచేస్తున్న సంస్థల నుంచి అకారణంగా ఉద్వాసనకు గురవుతుండగా, వారికి స్థానం కల్పించేందుకు ఇతర సంస్థలు తలుపులు మూస్తున్నాయి. చాలా సున్నితంగా వారిని నిరాకరిస్తున్నాయి. తాము ఉద్యోగం కోరినప్పుడు.. ‘మేము మరింత చురుకైన వారి కోసం చూస్తున్నాం’, ‘ఈ పోస్టుకు యువరక్తం కావాలి’, ‘మీ అర్హత కొంచం ఓవర్ క్వాలిఫైడ్గా ఉంది’ వంటి సమాధానాలు వినిపిస్తున్నాయని ఉపాధి కోసం వెతుకుతున్న మధ్య వయస్కులు వాపోతున్నారు.