న్యూఢిల్లీ, జనవరి 9: లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తున్నది. నలుగురు మాజీ ముఖ్యమంత్రులను ప్రధాని మోదీ తన క్యాబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు నేషనల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. కుమారస్వామి మినహా మిగతా ముగ్గురు బీజేపీ వ్యక్తులే.
కర్ణాటకలో ఇటీవల బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకోవటంతో ఆ పార్టీ నేత కుమారస్వామిని కూడా కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలిసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయా రాష్ర్టాల్లో సీట్లతోపాటు ఓటుబ్యాంకును పెంచుకొనేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు భావిస్తున్నారు. మరోవైపు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ గెలిచినప్పటికీ సీఎం పదవులు ఆశించిన వసుంధర, శివరాజ్సింగ్ను బీజేపీ అధిష్ఠానం పక్కనబెట్టింది. దీంతో వారు తీవ్ర అసంతృత్తితో ఉన్నారని సమాచారం.