జంషెడ్పూర్, జనవరి 10: ‘బలపం పట్టి బిడ్డ బడిలో అఆ.. ఇఈ నేర్చుకుంటాం’ అంటూ పలకా బలపం పట్టి పిల్లలతో పాటు బడికి తయారై పోతున్నారు జార్ఖండ్‌లోని నిరక్షరాస్య తల్లిదండ్రులు. ‘మీరు చదువుకోలేదా? ఏం పర్వాలేదు.. మీ పిల్లలతో పాటు మీకు కూడా చదువు నేర్పిస్తామంటూ’ ముందుకొచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఈ పథకాన్ని 2026-27 విద్యా సంవత్సరంలో జంషెడ్‌పూర్‌లో ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది.
ఈ కార్యక్రమం కింద పాఠశాలలు జరిగే వేళల్లోనే తల్లిదండ్రులకు కూడా ప్రతి రోజూ గంట పాటు చదువు చెబుతారు. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులకు రోజువారీ జీవితంలో స్వయం సమృద్ధి సాధించేలా, తీర్చిదిద్దడంతో పాటు, వారి పేరు రాయడం, సంతకం చేయడం వంటిని నేర్పిస్తామని అధికారులు తెలిపారు. అలాగే మార్కెట్లో జరిపే కొనుగోళ్లు, అమ్మకాలకు ఉపయోగపడేలా చిన్న చిన్న కూడికలు, తీసివేతలు, భాగహారాలు కూడా నేర్పుతామన్నారు. వారి నైపుణ్యాన్ని పరిశీలించేందుకు కాలానుగుణ పరీక్షలు నిర్వహిస్తామని ఒక అధికారి తెలిపారు.