హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తేతెలంగాణ) : అంతరిక్ష వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రోకు చెందిన ఎన్ఎస్ఐఎల్ సరికొత్త విజయాన్ని అందుకుంది. ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈఎస్ఏ) చేపట్టిన ప్రోబా-3 మిషన్‌కు చెందిన రెండు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ59 వాహకనౌక ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్) వాణిజ్య విభాగం. ప్రోబా-3 మిషన్ కోసం రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే కాంట్రాక్టును ఎన్ఎస్ఐఎల్కు ఈఎస్ఏ అప్పగించింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం 8.05 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జంట ఉపగ్రహాలను మోసుకొని పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 18 నిమిషాల ప్రయాణం తర్వాత ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేయడమే ప్రోబా-3 మిషన్ లక్ష్యం. దాదాపు 550 కిలోల బరువైన ఈ రెండు ఉపగ్రహాలు (కరోనాగ్రాఫ్, ఆక్యుల్టర్) భానుడి గుట్టు విప్పేందుకు ఉపయోగపడనున్నాయి. ఆ ఉపగ్రహాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ క్రమపద్ధతిలో భూకక్ష్యలో విహరించనున్నాయి. ఇందులో ఏ ఒకటి నిర్దిష్ట కక్ష్యలోకి చేరకపోయినా రెండో శాటిలైట్‌తో ఉపయోగం లేకుండా పోతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(పీఎస్ఎల్వీ) నమ్మకమైన పనితీరుకు ఈ ప్రయోగం ఉదాహరణగా నిలిచిందని ఇస్రో పేర్కొన్నది. కాగా, ఈ ప్రయోగం బుధవారం చేపట్టాల్సి ఉంది. చివరి నిమిషంలో ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని ఇస్రో గురువారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.