(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో అరుదైన ఘనత సాధించింది. ఇస్రో చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ ప్రయోగించని భారీ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడంలో శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారు. అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం ‘బ్లూబర్డ్ బ్లాక్-2’ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టడంలో ఇస్రో రాకెట్ ‘ఎల్వీఎం3-ఎం6’ విజయం సాధించింది. గగన్‌యాన్ కోసం సిద్ధమవుతున్న వేళ ఈ ప్రయోగం తమలో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపిందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ అన్నారు. భారత నేల నుంచి పైకెగసిన అతి భారీ రాకెట్ ఇదేనని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటని ఆనందం వ్యక్తం చేశారు. ప్రయోగం విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ వాణిజ్య ప్రయోగాల్లో భారత్ మరోసారి సత్తా చాటిందని ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన కొనియాడారు.
ఏమిటీ ప్రయోగం.. ఎందుకు?
టవర్లు, కేబుల్స్‌తో పనిలేకుండా శాటిలైట్ల నుంచి నేరుగా మొబైల్ కనెక్టివిటీ అందించాలనే లక్ష్యంతో అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ అనే సంస్థ ‘బ్లూబర్డ్ బ్లాక్-2’ అనే ఉపగ్రహాన్ని రూపొందించింది. దీని బరువు 6,100 కిలోలు. దీన్ని 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూ దిగువ కక్ష్యలోకి చేర్చాలి. అదే జరిగితే, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఏ సమయానికైనా, ఎవరికైనా 4జీ, 5జీ వాయిస్, వీడియో కాల్స్, సందేశాలు పంపించవచ్చు. అయితే, ఇంత భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చాలంటే, అంతే భారీ వ్యోమనౌక అవసరపడుతుంది. దీంతో ఏఎస్టీ స్పేస్ మొబైల్ కంపెనీ.. ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌ను సంప్రదించింది. తమకు అవసరమైన సేవల గురించి విజ్ఞప్తి చేసింది.
రంగంలోకి బాహుబలి ఇలా..
మిషన్‌లోని క్లిష్టతలను పూర్తిగా అర్థం చేసుకొన్న ఇస్రో టీమ్ ప్రయోగం చేయడానికి సమ్మతించింది. అయితే, 6,100 కిలోల బరువు ఉన్న ఇంత భారీ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టాలంటే బాహుబలి రాకెట్ అవసరపడుతుంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలకు ఎల్వీఎం3-ఎం6 రాకెట్ గుర్తొచ్చింది. ఈ రకం వ్యోమనౌక ద్వారానే చంద్రయాన్-2, చంద్రయాన్-3తో పాటు 72 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి తీసుకెళ్లడం వంటి భారీ ప్రయోగాలను పూర్తి చేశారు. అంతే, అత్యంత తక్కువ సమయంలోనే 43.5 మీటర్ల పొడవైన ఎల్వీఎం3-ఎం6 రాకెట్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు.
శకలాల వల్ల ఆలస్యంగా ప్రయోగం
షెడ్యూల్ ప్రకారం.. ఏపీలో ఉన్న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్-షార్ నుంచి బుధవారం ఉదయం 8.54 గంటలకు రాకెట్‌ను ప్రయోగించాలి. అయితే, 90 సెకండ్ల ఆలస్యంగా అంటే ఉదయం 8 గంటల 55 నిమిషాల 30 సెకండ్లకు వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. అయినప్పటికీ, బయల్దేరిన 15 నిమిషాల్లో మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసి ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రయోగం సెకండ్లపాటు వాయిదా పడటానికి గల కారణంపై శాస్త్రవేత్తలు స్పందించారు. రాకెట్ ప్రయాణించే కక్ష్యలో కొన్ని ఉపగ్రహాల శకలాలు అడ్డొచ్చే ప్రమాదం ఉండటంతోనే 90 సెకండ్లపాటు ప్రయోగాన్ని ఆలస్యం చేసినట్టు తెలిపారు.