ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చీఫ్ వీ నారాయణన్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్రో 40 అంతస్తుల భవనం అంత పొడవైన రాకెట్‌ను నిర్మిస్తుందని.. 75 టన్నుల పేలోడ్‌ను తక్కువ ఎత్తులోని భూకక్ష్యలోకి తీసుకెళ్లగలదని తెలిపారు. ఆయన హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఏడాది ఇస్రో నావిక్ (NAVIC) ఉపగ్రహం, ఎన్1 (N1) రాకెట్ వంటి ప్రాజెక్టులను చేపట్టనుందని పేర్కొన్నారు. భారతీయ రాకెట్ ద్వారా 6,500 కిలోల అమెరికన్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తయారు చేసిన మొదటి లాంచర్ 17 టన్నుల బరువు కలిగి ఉండేదని.. ఇది 35 కిలోల పేలోడ్‌ను భూమి దిగువ కక్ష్యకు పంపారన్నారు.
ఈ రోజు మనం 75వేల కిలోల పేలోడ్‌ను పంపగల రాకెట్‌ను తయారు చేస్తున్నామని.. దీని ఎత్తు 40 అంతస్తుల భవనం అంత ఎత్తులో ఉంటుందని చెప్పారు. ఈ సంవత్సరం ఇస్రో భారత నావికాదళం కోసం నిర్మించిన టెక్నాలజీ ప్రదర్శన ఉపగ్రహంచ మిలిటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహం GSAT-7R ను ప్రయోగించాలని యోచిస్తున్నట్లు నారాయణన్ వెల్లడించారు. ఇది ప్రస్తుత GSAT-7 (రుక్మిణి) ఉపగ్రహాన్ని భర్తీ చేయనుందని వెల్లడించారు. ప్రస్తుతం అంతరిక్షంలో కక్ష్యలో భారత్ 55 ఉపగ్రహాలను కలిగి ఉందని, రాబోయే మూడు-నాలుగు సంవత్సరాలలో ఇది మూడు రెట్లు పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ నారాయణ్‌కు గౌరవ డాక్టరేట్‌ని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రదానం చేశారు. భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి నారాయణన్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.