న్యూఢిల్లీ: భారత్ తన తొలి మానవరహిత గగన్‌యాన్ యాత్రకు సన్నద్ధమవుతున్న తరుణంలో మానవ అంతరిక్షయానం కేవలం ఒక తాత్కాలిక ప్రదర్శనగా కాకుండా ఒక నిరంతర సామర్థ్యంగా మారేందుకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను కూడా ఇస్రో నిర్మిస్తున్నది. అటువంటి సౌకర్యాలల్లో ఒకటి శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ప్రతిపాదిస్తున్న గన్యాత్రి నివాస్, క్రూ ఐసోలేషన్ ఫెసిలిటీ.
ఈ సదుపాయానికి చెందిన ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణం, ప్రారంభం కోసం ఇస్రో టెండర్‌ను ఆహ్వానించింది. నిరంతర మానవ అంతరిక్ష యాత్ర కార్యకలాపాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఇస్రో చేపడుతున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు.