న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ’గగన్‌యాన్’ దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ముఖ్యమైన ముందడుగు వేసింది. ఈ మిషన్ కోసం రూపొందించిన పారాచూట్ ఆధారిత డీసెలరేషన్ వ్యవస్థ మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (ఐఏడీటీ-01)ను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది.
వ్యోమగాములు సురక్షితంగా భూమికి తిరిగి రావడానికి అవసరమైన భద్రతా యంత్రాంగాన్ని ధ్రువీకరించడంలో కీలకమైన ఘట్టంగా ఈ పరీక్ష నిలిచింది. ఈ ప్రయోగాన్ని భారత వైమానిక దళం (ఐఏఎఫ్), డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), భారత నౌకాదళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ వంటి ప్రముఖ సంస్థల సహకారంతో నిర్వహించారు.
అంతరిక్షం నుంచి తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించిన తరువాత, వ్యోమగాముల క్రూ మాడ్యూల్‌ను నియంత్రిత వేగంతో భూమిపై దించడానికి ఈ పారాచూట్ వ్యవస్థ చాలా అవసరం. ఈ పరీక్ష సమయంలో ఒక విమానం నుంచి నమూనా మాడ్యూల్‌ను కిందకు వదలగా, అది కొత్తగా అభివృద్ధి చేసిన పారాచూట్ సహాయంతో సురక్షితంగా భూమిపైకి దిగింది.
ఈ పరీక్ష ద్వారా పారాచూట్ పనితీరు విజయవంతమైంది. మాడ్యూల్ విడుదలైన తరువాత డ్రోగ్ పారాచూట్, ఆ తర్వాత ప్రధాన పారాచూట్ విచ్చుకుని, సురక్షితంగా ల్యాండ్ అయ్యే వరకు వేగాన్ని నియంత్రించడం వంటి ప్రక్రియలు సజావుగా జరిగాయి. మానవసహిత యాత్రకు ఇస్రో సిద్ధమవుతున్న తరుణంలో ఈ విజయం సంస్థ విశ్వాసాన్ని మరింత పెంచింది. 2028లో భారత్ చేపట్టే మానవసహిత యాత్రతో స్వతంత్రంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపగల నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది.