బెంగళూరు: పునర్వినియోగ వాహకనౌక ‘పుష్పక్’ ల్యాండింగ్ సామర్థ్యాన్ని మూడోసారి విజయవంతంగా పరీక్షించినట్టు ఇస్రో ప్రకటించింది. ఇప్పటికే రెండుసార్లు ఈ వాహకనౌకను పరీక్షించిన ఇస్రో ఆదివారం ఉదయం 7.10 గంటలకు చివరిసారిగా, మూడోసారి ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్(ఎల్ఈఎక్స్-03)ని విజయవంతంగా పరీక్షించింది.
కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏటీఆర్) వద్ద ఈ ప్రయోగం నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా భారత వాయుసేనకు చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా రన్‌వేకు 4.5 కిలోమీటర్ల దూరంలో, గగనతలంలో 4.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి పుష్పక్‌ను వదిలిపెట్టారు. ఇది ప్రతికూల పరిస్థితులను, పరీక్షలో భాగంగా కల్పించిన అవాంతరాలను ఎదుర్కొని దానికదే ముందుగా నిర్దేశించిన రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.