గాజా సిటీ : హమాస్ మిలిటెంట్లతో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన వెంటనే ఇజ్రాయెల్ సైన్యం గాజాపై మరోసారి బాంబులతో విరుచుకుపడింది. ఇండ్లు, నివాస భవనాలపై బాంబుల వర్షం కురిపించింది. శుక్రవారంతో ఒప్పందం ముగిసిన గంటలోపే గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ దాడుల్లో 178 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. 200కు పైగా హమాస్ లక్ష్యాలపై తాము దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ పేర్కొన్నది. హమాస్ మిలిటెంట్లు కూడా ఇజ్రాయెల్ భూభాగంపైకి రాకెట్ల ప్రయోగాన్ని తిరిగి ప్రారంభించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని మధ్యవర్తిగా ఉన్న ఖతార్ వెల్లడించింది.