న్యూఢిల్లీ, మే 16 : ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాల నేపథ్యంలో వాస్తవాలను తెలుసుకునేందుకు, పరిస్థితులపై చర్చించేందుకు పార్లమెంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విపక్షాలు చేస్తున్న డిమాండ్‌కు అధికార బీజేపీ విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ప్రత్యేక సమావేశానికి బీజేపీ ఎంతమాత్రం ఇష్టపడటం లేదని పలు ఆంగ్ల మీడియా కథనాలు తెలిపాయి. దీంతో జూలైలో జరిగే వర్షాకాల సమావేశాల్లోనే ప్రతిపక్షాలు ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తాల్సి ఉంది.
పహల్గాం దాడి అనంతరం జరిగిన పరిణామాలు, విపక్షాలతో కలిసి తీసుకున్న నిర్ణయాలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొన్నది. ఆపరేషన్ సిందూర్ పూర్తిగా నిలిచిపోలేదని, ఇటువంటి పరిస్థితుల్లో అనవసర చర్చలకు తావిచ్చి శత్రు దేశానికి లేనిపోని ఊతాలు ఇవ్వడం ఎంతమాత్రం సబబు కాదని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నది.