న్యూఢిల్లీ: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోనల్ డైరక్టర్ సమీర్ వాంఖడే ఇప్పుడు ఓ సెన్షేషన్. బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను డ్రగ్స్ కేసులో అరెస్టు చేసింది ఈయనే. అయితే సమీర్ వాంఖడే ఏ మతానికి చెందినవాడన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సమీర్ వాంఖడే ఓ ముస్లిం అని, అతనికి డీ కంపెనీతో లింకులు ఉన్నాయని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉద్యోగం కోసం సమీర్ వాంఖడే కులద్రువీకరణ పత్రాన్ని ఫోర్జరీ చేసినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సమీర్ వాంఖడే తన కుల ద్రువీకరణ పత్రాన్ని .. ఢిల్లీలోని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్‌కు సమర్పించారు.
తాను మాత్రం షెడ్యూల్ కులానికి చెందినట్లు సమీర్ వాంఖడే స్పష్టం చేశారు. తన కులద్రువీకరణకు చెందిన పత్రాలను ఢిల్లీలో ఎస్సీ కమిషన్‌కు అందజేశారు. ఆ డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత వివరణ ఇస్తామని ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యుడు సుభాష్ రామ్‌నాథ్ పార్ది తెలిపారు. కమిషన్ అడిగిన అన్ని దస్త్రాలను, వాస్తవాలను సమర్పించినట్లు సమీర్ వాంఖడే తెలిపారు. తన ఫిర్యాదును కమిషన్ సమీక్షిస్తుందని, త్వరలోనే కమిషన్ చైర్మన్ వివరణ ఇస్తారని సమీర్ చెప్పారు. సమీర్ అందజేసిన డాక్యుమెంట్లను మహారాష్ట్ర ప్రభుత్వం వద్ద పరిశీలిస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయ్ సంపాలా తెలిపారు.
సమీర్ వాంఖడే ముస్లిం పేరు పెట్టుకున్నాడని, అతని క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం హిందువులదని మంత్రి నవాబ్ ఆరోపణలు చేశారు. దీనిపై సమీర్ పత్రికా ప్రకటన చేశారు. తన తండ్రి ధ్యాన్‌దేవ్ కచ్రూజీ వాంఖడే దళితుడని, ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్గా చేసి రిటైరయ్యారని, ఆయన హిందువు అని, తల్లి జహీదా ముస్లిం మతస్తురాలని సమీర్ తన ప్రకటనలో స్పష్టం చేశారు. షారూక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టు తర్వాత సమీర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. సమీర్ ముస్లిం అని మంత్రి నవాబ్ ఆరోపించారు. ఎస్సీ కోటాలో ఎన్సీబీ ఉద్యోగం కోసం సమీర్ కులద్రువీకరణ పత్రాన్ని ఫోర్జరీ చేసినట్లు పేర్కొన్నారు.
సమీర్ తండ్రి కూడా ఇటీవల మీడియాతో మాట్లాడారు. తాను దళితుడిని అని చెప్పారు. బాబా సాహెబ్ అంబేద్కర్‌ను ఫాలో అవుతున్నట్లు వెల్లడించారు. మంత్రి నవాబ్ మాలిక్ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నట్లు ఆరోపించారు. క్రూయిజ్‌లో డ్రగ్స్ పార్టీపై దాడి చేసి ఆర్యన్‌ను అరెస్టు చేసిన తర్వాత సమీర్ వాంఖడేపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సమీర్ వాంఖడే తొలుత ముస్లింని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత మళ్లీ హిందువును వివాహం చేసుకున్నాడు. 2006లో డాక్టర్ షబానా ఖురేషిని సమీర్ పెళ్లాడాడు. 2016లో వాళ్లు విడాకులు తీసుకున్నారు. 2017లో క్రాంతి రేడ్కర్‌ను సమీర్ పెళ్లి చేసుకున్నాడు.