చెన్నై: తమిళనాడులో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై (Annamalai) కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు చర్చ జరుగుతున్నది. ‘నిర్భయ మనస్సులకు పరిమితులు ఉండవు’ అన్న పేరుతో కోయంబత్తూరు అంతటా ఆయన పోస్టర్లు వెలిశాయి. రాష్ట్ర కేంద్ర కమిటీ సమావేశాన్ని కోయంబత్తూరులో బీజేపీ నిర్వహిస్తున్న సమయంలోనే ఈ పరిణామం జరుగడం విశేషం.
కాగా, అన్నామలై కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటి వరకు రెండు రాష్ట్ర కేంద్ర కమిటీ సమావేశాలకు ఆయన గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో అన్నామలై అభిమాన సంక్షేమ సంఘమైన ‘అన్నామలై అన్బు కూట్టం’ కొత్త పార్టీ ఊహాగానాలకు తెరతీసింది. కొత్త సభ్యులను, కార్యవర్గ సభ్యులను చేర్చుకుంటున్నట్లు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. అలాగే బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ను ఢిల్లీలో అన్నామలై కలిసి ఆ పార్టీకి ఆయన రాజీనామా చేయనున్నట్లు తెలుస్తున్నది.
మరోవైపు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం చేసిన ఒక ట్వీట్ ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. ‘తమిళనాడులో మరో రాజకీయ పార్టీ రాబోతోంది. మార్పులు వేగవంతమవుతున్నాయి. (ఎంఎస్ – ప్రతిపాదిత పేరులో ఒక ఆసక్తికరమైన తర్కం ఉన్నది)’ అని ఆయన ట్వీట్ చేశారు.