న్యూఢిల్లీ: పీఎం కిసాన్ కింద ఆర్థిక మద్దతును పొందుతున్న 31 లక్షల మందికి పైగా లబ్ధిదారులలో భార్యాభర్తలిద్దరూ ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ పథకం నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమి ఉన్న కుటుంబంలో భార్యాభర్తలలో ఎవరో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. కాని 31 లక్షల మందికి పైగా కేసులలో భార్యాభర్తలిద్దరూ విడివిడిగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గుర్తించింది. తనిఖీల సందర్భంగా ఈ కేసులు బయటపడడంతో అక్టోబర్ 15లోగా తనిఖీలు చేపట్టి అలా కుటుంబంలో ఇద్దరూ లబ్ధిపొందుతున్న వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించాలని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర వ్యవసాయ శాఖ కోరింది.
ఈ పథకం కింద 21వ వాయిదా చెల్లింపు త్వరలో జరగనున్న నేపథ్యంలో కేంద్రం రాష్ర్టాలకు ఈ గడువు పెట్టింది. కాగా 31 లక్షల కేసులలో దాదాపు 19 లక్షల కేసుల తనిఖీ పూర్తి అయినట్లు తెలుస్తోంది. వీటిలో 94 శాతం కేసులలో భార్యాభర్తలిద్దరూ లబ్ధిదారులుగా తేలింది. పీఎం కిసాన్ కింద రూ. 6,000 మూడు సమాన వాయిదాలలో ప్రతి నాలుగు నెలలకోసారి కేంద్రం భూమి ఉన్న రైతు కుటుంబాలకు విడుదల చేస్తోంది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించగా ఇప్పటి వరకు 9.7 కోట్లకు పైగా భూమి ఉన్న రైతులకు 20 వాయిదాలలో ఆర్థిక మద్దతు లభించింది.