గాంధీనగర్, అక్టోబర్ 29: కేంద్రం నిర్వాకంతో కునారిల్లుతున్న రైతన్న దుస్థితికి అద్దం పట్టే సంఘటన ఇది.. కార్పొరేట్ ప్రభుత్వాలు ఏలుతున్న దేశంలో అన్నదాతల దారుణ పరిస్థితికి వాస్తవ రూపం ఇది.. పెట్టుబడికి పెట్టిన పైసలు కూడా రాక పంటనంతా ఉచితంగా పంచిపెడుతున్నారు గుజరాత్ రైతులు. అక్కడ బహింగ మార్కెట్, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలో వెల్లుల్లి ధర భారీగా పడిపోయింది. దీంతో కలత చెందిన రైతన్నలు.. పేదలకు ఇచ్చేస్తున్నారు.
ఆ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో శనివారం గుజరాత్ కిసాన్ సంఘటన్ 4వేల కిలోల వెల్లుల్లిని పంచిపెట్టింది. దీనిపై గుజరాత్ కిసాన్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు గజేంద్రసిన్హా జాలా మాట్లాడుతూ.. ఉద్యాన పంటలకు కూడా మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకొంటున్నా పట్టించుకోవటం లేదని, దీంతో రైతులు నిట్టనిలువునా మోసపోతున్నారని వెల్లడించారు. కనీసం రైతులకు సాయం చేయటానికి కూడా ప్రభుత్వాలు ముందుకు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ధర రాకపోతే రైతు మరోసారి ఆ పంట పండించడని, దాంతో కొరత ఏర్పడుతుందని.. ఇది దేశానికి మంచిది కాదని ఆయన తెలిపారు. ఇప్పటికైనా కేంద్రంలోని మోదీ సర్కారు నిద్ర లేవాలని చురక అంటించారు.
వెల్లుల్లి సమస్యపై గుజరాత్ వ్యవసాయ శాఖ మంత్రి రాఘవ్జీ పటేల్‌ను వివరణ కోరగా.. మద్దతు ధర ప్రకటించటం కేంద్రం చేతుల్లోనిదని, తమకు సంబంధం లేదని తప్పించుకొన్నారు. కావాల్సివస్తే ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని చేతులు దులుపుకొన్నారు.
అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం. మద్దతు ధరను పక్కాగా అమలుచేస్తాం. ఉపాధి హామీని సాగుకు అనుసంధానం చేస్తాం. 60 ఏండ్లు దాటిన రైతులకు పింఛను ఇస్తాం.
కష్టపడి పండించినా.. మార్కెట్లో ధర భారీగా పడిపోవటంతో రైతులు పంటనంతా ఉచితంగానే పంచిపెడుతున్నారు. ఇదెక్కడో బీజేపీయేతర రాష్ట్రంలో కాదు. మోదీ, అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్లో.
రైతు పెట్టుబడి రూ.37,100
దిగుబడి 3000 కిలోలు
ధర: 20 కిలోలకు రూ.150
వస్తున్న ఆదాయం రూ.22,500
నష్టం: 14,600