(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట ఇరాన్‌లోని అణు కేంద్రాలు, సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులతో పశ్చిమాసియా అట్టుడుకిపోతున్నది. ఇజ్రాయెల్ ఇప్పటికిప్పుడు ఈ దాడులు చేయడానికి కారణం ఇరాన్ నిర్వహిస్తున్న ‘అణు కార్యక్రమమే’నని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోజులవ్యవధిలో ఇరాన్ 15 అణుబాంబులను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని, ఇప్పటికిప్పుడు తొమ్మిది అణ్వాయుధాలను ఏర్పాటుచేయగల యూరేనియం నిల్వలు ఆ దేశంలో ఉన్నట్టు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. ఇది తమ దేశ అస్తిత్వానికే ప్రమాదమని ఇజ్రాయెల్ భావించింది. పైగా అణు కార్యక్రమంపై ఓ ఒప్పందానికి రావాలంటున్న అమెరికా ప్రతిపాదనలను కూడా ఇరాన్ పట్టించుకోవట్లేదు. దీంతో ఇరాన్ ‘అణు’ సామర్థ్యాన్ని దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే ఇజ్రాయెల్ ఇప్పటికిప్పుడు ఈ దాడులకు పాల్పడినట్టు అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు. దాదాపు అర్ధ శతాబ్దం క్రితమే ఈ రెండు దేశాల మధ్య వైరం ప్రారంభమైంది. గతంలో అమెరికాతో జతకట్టిన పహ్లావీ రాజవంశం 1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవంతో అధికార పీఠాన్ని కోల్పోయింది. అనంతరం ఇరాన్ పాలనా పగ్గాలను చేపట్టిన అయతుల్లా ఖమేనీ వర్గం అమెరికా పట్ల ద్వేషంతో మెలగసాగింది. నాటి నుంచి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం క్రమంగా పెరిగింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నదని ఖమేనీ ఆరోపిస్తూ వస్తున్నారు. దీంతో దశాబ్దాల నుంచే రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. కానీ, ఆ దాడుల్లో తమ ప్రమేయం లేదని రెండు దేశాలు ఖండించడంతో ఈ సంఘర్షణను ‘షాడో వార్’ అని పిలవడం మొదలుపెట్టారు.