Iran blast : ఇరాన్ (Iran) లోని అత్యాధునిక షాహిద్ రజాయీ నౌకాశ్రయంలో శనివారం సంభవించిన భారీ పేలుళ్ల (Blasts) లో మృతిచెందిన వారి సంఖ్య 28కి పెరిగింది. ఈ ఘటనలో సుమారు 750 మందికిపైగా గాయపడ్డారు. పేలుడులో పెద్దఎత్తున చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది (Fire fighterss) తీవ్రంగా శ్రమించారు. దాదాపు 10 గంటలకుపైగా శ్రమించి మంటలను ఆర్పాల్సి వచ్చింది.
సహాయక చర్యల్లో మొత్తం నాలుగు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ పాల్గొన్నాయని హెర్మోజ్గాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ చీఫ్ ముక్తార్ సలాహ్షౌర్ చెప్పారు. చాలా కంటెయినర్లు పేలడంవల్ల ఈ దుర్ఘటన జరిగిందని హెర్మొజ్గాన్ ప్రావిన్స్ క్రైసిస్ మేనేజ్మెంట్ అథారిటీ చీఫ్ మెహద్రద్ హస్సన్ జడేహ్ చెప్పారు. గాయపడిన వారు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ఇరాన్‌లోని అతిపెద్ద నౌకాశ్రయంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సమీపంలోని భవనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఒక భవనం నేలకూలింది. దట్టమైన నల్లటి పొగ వ్యాపించింది. పేలుడు నేపథ్యంలో ఘటనాస్థలానికి సమీపంలో ఉన్న పాఠశాలలు, కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేశారు. అయితే ఇది దాడి కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఇప్పటికే స్పష్టంచేశారు.
పోర్టులో నిల్వ ఉన్న కొన్ని కంటెయినర్లు పేలడంతో ప్రమాదం జరిగిందని స్థానిక విపత్తు నిర్వహణ అధికారి మెహర్దాద్ హసన్జాదే చెప్పారు. ఈ ఘటనకు అసలు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. పేలుళ్లకు కారణం తెలుసుకోవడం కోసం దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. అయితే క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.