Plane Crash | అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రమాదం విషయం తెలియగానే విజయవాడ నుంచి బయలుదేరానన్నారు. ప్రధాని మోదీ ఫోన్ చేసి ప్రమాదం గురించి వివరాలు అడిగారని తెలిపారు. విమాన ప్రయాణికుల్లో చిన్నారులు కూడా ఉన్నారని.. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరుగుతోందని.. మృతుల సంఖ్య గురించి ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు. మృతుల సంఖ్య గురించి ఇప్పుడే ఏం చెప్పలేమని.. విమాన ప్రమాద బాధ్యులను ఉపేక్షించమని స్పష్టం చేశారు. విమాన ప్రయాణికుల్లో విజయ్ రూపానీ ఉన్నారన్నారు. ప్రమాద ఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు.
సహాయక చర్యలపై డీజీసీఏ, ఏఏఐ, ఎన్డీఆర్ఎఫ్, గుజరాత్ ప్రభుత్వ సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) డైరెక్టర్ జనరల్ దర్యాప్తు కోసం బృందంతో అహ్మదాబాద్‌కు చేరుకుంది. ప్రమాదానికి సంబంధించి అన్ని కారణాలపై ఆరా తీస్తున్నది. దర్యాప్తు తర్వాత ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశాలున్నాయి. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు గురువారం మధ్యాహ్నం 1.38 గంటలకు బయలుదేరి రెండు నిమిషాల తర్వాత 1.40 గంటలకు కూలిపోయింది. ఈ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు, ఒకరు కెనడియన్ పౌరుడు ఉన్నారు. ప్రమాదం నుంచి ఒకరు బయటపడగా.. మిగతా ఎవరూ బతికేందుకు అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, విమానం ఓ మెడికల్ ఆసుపత్రి హాస్టల్‌పై కూలడంతో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఎందరు చనిపోయారన్న విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు.