Sharad Pawar | కేంద్ర దర్యాప్తు సంస్థలు తమకున్న అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నాయని గత కొన్నాళ్లుగా అనేక రాజకీయ పక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలు కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని మిగతా పక్షాల నేతలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని చాలా ఏండ్లుగా వింటున్నాం. ఇటీవలి కాలంలో ఈ విపరీత ధోరణులు మరీ ఎక్కువయ్యాయి. తమ మాట వినని నేతలను, తమకు మద్దతు ఇవ్వని పార్టీలను అణగదొక్కేందుకు కేంద్రంలోని ప్రభుత్వాలు వివిధ దర్యాప్తు సంస్థల సాయం తీసుకుంటున్నాయి. ఆయా సంస్థల పనితీరుపై విమర్శలు వస్తున్నా ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు..’ అన్న చందంగా వ్యవహరిస్తూ అభాసుపాలవుతున్నాయి.
కేంద్ర దర్యాప్తు సంస్థ తీరుతో తమ సీనియర్ నేత ఏడాది కాలంగా జైలులో ఉన్నారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబైలోని ఆర్ధర్ రోడ్ జైలు నుంచి మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ బుధవారం విడుదలయ్యారు. ఇవాళ ఆయన శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. జైలుకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితులు, జైలులో ఎదుర్కొన్న అవమానాలను శరద్ పవార్‌కు పూసగుచ్చినట్లు అనిల్ దేశ్‌ముఖ్ వివరించి చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దేశ్‌ముఖ్‌కు బెయిల్ ఇవ్వడంపై పవార్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది.
అనిల్ దేశ్‌ముఖ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థల ‘అధికార దుర్వినియోగానికి’ ఉదాహరణగా శరద్ పవార్ అభివర్ణించారు. ఈ సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాలని ఆయన యోచిస్తున్నాడు. త్వరలోనే మోదీని కలుసుకుని దర్యాప్తు సంస్థ అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేయనున్నట్లు శరద్ పవార్ వెల్లడించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఆగడాలకు అనిల్ దేశ్‌ముఖ్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని పవార్ చెప్పారు. అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశారో అనిల్ దేశ్‌ముఖ్ కేసులో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నదని పవార్ తెలిపారు. తొలుత దాదాపు రూ.100 కోట్లు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి, కానీ ఛార్జిషీట్లో ఆ సంఖ్య రూ.1 కోటికి తగ్గిందని పేర్కొన్నారు. దేశ్‌ముఖ్ ఎదుర్కొన్న పరిస్థితులు మరొకరి రాకుండా ఉండేందుకే ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పవార్ స్పష్టం చేశారు.