Bihar | పరీక్షలు నేలపై జరగడం చూశాం. పరీక్షల సందర్భంగా బెంచీలు సరిపోవడం లేదన్న ఫిర్యాదులు విన్నాం. పరీక్షల సందర్భంగా బస్సుల సంఖ్య తక్కువగా ఉందని విన్నాం. సరైన సమయానికి అభ్యర్థులు రాలేదని విన్నాం. పరీక్ష కేంద్రాల్లో టాయ్లెట్ల సౌకర్యం లేదన్న వార్తలూ విన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు. మీరు వినేది మరో ఎత్తు. వాహనాల ఫ్లడ్ లైట్ల మధ్య పరీక్షలు జరగడం ఎప్పుడైనా విన్నారా? నిజమే మీరు విన్నది. ఇది ఒక్క బిహార్‌లోనే సాధ్యమవుతుంది. బిహార్ ఇంటర్ పరీక్షలు వాహనాల ఫ్లడ్‌లైట్ల మధ్యలోనే జరిగాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతోంది.
మహారాజ హరేంద్ర కిషోర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. రెండో షిప్టు పరీక్ష ప్రారంభమైంది. దాదాపు 1200 మంది రెండో షిఫ్టులో పరీక్షలు రాస్తున్నారు. అయితే తాము పై అంతస్తులో వీరి కోసం స్థలం కేటాయించామని, వివిధ సమస్య ల కారణంగా ఈ నిర్ణయాన్ని మార్చుకున్నామని పరీక్షాధికారి పేర్కొన్నారు. కూర్చోడానికి ఇబ్బందులు తలెత్తాయని, ఈ సందర్భంగా గందరగోళం చోటు చేసుకుందని ఆయన తెలిపారు. ఈ గందరగోళం పెరగడంతో తాము ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని, అధికారులు వచ్చిన తర్వాత.. సుమారు 4ః30 గంటల ప్రాంతంలో పరీక్ష ప్రారంభమైందని తెలిపారు.
ఇక… ఈ గందరగోళం కారణంగా పరీక్ష దాదాపు రెండు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే ఈ గందరగోళం ఏర్పడడానికి కారణాలేంటి? అన్న అంశంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పరీక్ష చాలా ఆలస్యంగా ప్రారంభం కావడంతో సూర్యాస్తమయం అయ్యింది. ఆ ప్రాంతంలో కరెంట్ అందుబాటులో కూడా లేకపోవడం విడ్డూరం. దీంతో పక్కనే పార్కింగ్‌లో ఉన్న వాహనాల లైట్ల వెలుగులో విద్యార్థులు తమ పరీక్షలు రాశారు.