న్యూఢిల్లీ, జూన్ 21: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు నూపుర్ శర్మ, జిందాల్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన నిందితుల ఇండ్లను ఉత్తరప్రదేశ్ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా బుల్డోజర్తో కూల్చివేయడంపై మాజీ బ్యూరోక్రాట్లు పలువురు సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు బహిరంగ లేఖ రాశారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. దేశంలోని పలు రాష్ర్టాల్లో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నవారి నివాసాలను బుల్డోజర్లతో కూలగొట్టడం సాధారణమైపోయిందని వారు ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగ సూత్రాలను, విలువలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. లేఖపై సంతకం చేసినవారిలో కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిైళ్లె, మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్, మాజీ ఐపీఎస్ అధికారులు జూలియో రిబెరియో, అవినాశ్ మోహననే, మ్యాక్స్వెల్ పెరీరియా, ఏకే సమంత, మాజీ న్యాయశాఖ కార్యదర్శి అనితా అగ్నిహోత్రి తదితరులు ఉన్నారు.