హైదరాబాద్, డిసెంబర్ 20 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఇటీవల ఎయిర్ ఇండిగో సంక్షోభం కారణంగా దేశంలోని లక్షలాది మంది విమాన ప్రయాణికులు ఎదుర్కొన్న ప్రయాణ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దీనంతటికీ దేశీయ విమానయాన రంగంలో ఇండిగో సంస్థకు ఉన్న గుత్తాధిపపత్యమే కారణమని, ఆ సంస్థ తప్పు చేసిందని తెలిసినా ప్రభుత్వం తక్షణం ఏ చర్యలూ తీసుకోలేని నిస్సహాయ స్థితిలో పడిందని అటు ప్రభుత్వ పెద్దలు, ఇటు మేధావులు, నిపుణులు కూడా నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌ల నిర్వహణలో గుత్తాధిపత్యం సాధించి అతిపెద్ద ఎయిర్‌పోర్టు ఆపరేటర్‌గా అవతరించిన అదానీ గ్రూప్‌పై ఇప్పుడు అందరూ దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే పలు విమానాశ్రయాలను చేజిక్కించుకున్న అదానీ గ్రూప్ గుత్తాధిపత్యాన్ని పలువురు వేలెత్తి చూపుతున్నారు.
వైమానిక రంగంలో మరో పెను సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. విమానాశ్రయాల నిర్వహణలో ఎలాంటి అనుభవం లేని అదానీ గ్రూప్.. మోదీ పాలనలో దేశంలోనే రెండో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఆపరేటర్‌గా అవతరించింది. రెండేండ్ల స్వల్ప వ్యవధిలోనే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 ఎయిర్‌పోర్టులను చేజిక్కించుకొంది. అంతటితో ఆగకుండా ఇప్పుడు మరో 12 విమానాశ్రయాలను కూడా తమ ఖాతాలో వేసుకొని, దేశంలోనే నంబర్ వన్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్‌గా మారేందుకు అడుగులు వేస్తున్నది. అదానీ గ్రూప్ కోసం ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కారుచౌకగా కట్టబెట్టిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. మరో డజను ఎయిర్‌పోర్టులను కూడా కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రానున్న ఐదేండ్లలో దేశంలోని 12 ఎయిర్‌పోర్టులను లీజుకు తీసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు అదానీ గ్రూప్ డైరెక్టర్ జీత్ అదానీ తెలిపారు. ఈ మేరకు రూ. లక్ష కోట్లను కేటాయించబోతున్నట్టు పేర్కొన్నారు. కాగా, దేశంలో రద్దీగా ఉండే ఎనిమిది ఎయిర్‌పోర్టులను కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇదివరకే అదానీ గ్రూప్‌నకు కట్టబెట్టింది. ఎయిర్పోర్ట్ నిర్వహణలో ఎలాంటి అనుభవంలేని కంపెనీలకు డీల్ అప్పగించవద్దంటూ ఆర్థిక వ్యవహారాల శాఖ (డీఈఏ), నీతి ఆయోగ్ చేసిన సూచనలను కూడా పక్కనబెట్టిమరీ ఈ ప్రక్రియకు ఆమోదముద్ర వేసింది. దీనికోసం నిబంధనలు కూడా మార్చేసింది.
ఈ డీల్‌లో అవకతవకలు జరిగాయంటూ.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఏఈయూ), ఆయా విమానాశ్రయాల్లో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగులు నిరసనోద్యమాలు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదు. వెరసి గత 8 ఎయిర్‌పోర్టులకు అదనంగా ఇప్పుడు ఇంకో 12 ఎయిర్‌పోర్టులు కూడా అదానీ కంపెనీపరమైతే గుత్తాధిపత్యం తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయాల్లో చార్జీల మోత మోగవచ్చని చెప్తున్నారు. ఇండిగో తరహా సంక్షోభాలు నిత్యకృత్యంగా మారే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.
ఎయిర్‌పోర్టులను చేజిక్కించుకొనేందుకు ఇతర సంస్థలపై అదానీ గ్రూప్ ఒత్తిళ్లకు కూడా పాల్పడుతుందని విమర్శలు ఉన్నాయి. జీవీకే గ్రూప్ నిర్వహణలో ఉన్న ముంబై ఎయిర్‌పోర్ట్‌ను కైవసం చేసుకోవడంలో అదానీ కంపెనీ అడ్డదారులు తొక్కినట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయంలో అదానీ కంపెనీకి కేంద్రం కూడా వంత పాడినట్టు విమర్శలు ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ముంబై ఎయిర్‌పోర్టులో జీవీకేకు 50.5 శాతం, దక్షిణాఫ్రికాకు చెందిన బిడ్వెస్ట్హడ్ కంపెనీకి 13.5 శాతం వాటా ఉండేది. ఒకవేళ బిడ్వెస్ట్హడ్ తన వాటాలను విక్రయించాలనుకొంటే తొలుత జీవీకేకు ఆ ఆఫర్‌ను ఇవ్వాలి. ఈ మేరకు ఆర్వోఎఫ్ఆర్ (రైట్ ఆఫ్ ఫస్ట్ రిఫ్యూజల్) క్లాజ్‌ను నిబంధనల్లో చేర్చారు. అయితే, అదానీ గ్రూప్ ఈ నిబంధనను తుంగలో తొక్కి, 2019లో బిడ్వెస్ట్హడ్ వాటాను చేజిక్కించుకొన్నది. దీంతో జీవీకే గ్రూప్ కోర్టులో కేసు వేసింది. ఈ క్రమంలోనే అనూహ్య పరిణామం చోటుచేసుకొన్నది.
ముంబై ఎయిర్పోర్ట్ అభివృద్ధిలో రూ.705 కోట్ల అవకతవకలకు పాల్పడినట్టు 2020 జూన్‌లో సీబీఐ.. జీవీకే గ్రూప్‌పై కేసు నమోదు చేసింది. అయితే, ఎప్పుడైతే ఈ ఎయిర్పోర్ట్ నిర్వహణలో ఉన్న తన 50.5 శాతం వాటాను అదానీ గ్రూప్‌నకు జీవీకే గ్రూప్ అప్పగించిందో.. సీబీఐ యూ-టర్న్ తీసుకొన్నది. ఈ కేసులో ఎలాంటి అవకతవకలు గుర్తించలేదంటూ కోర్టుకు తెలిపింది. జీవీకే గ్రూప్‌నకు ఒకవిధంగా క్లీన్చిట్ ఇచ్చింది. ఈ ఉదంతం వెనుక కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉన్నదని, అదానీ గ్రూప్‌నకు ముంబై ఎయిర్‌పోర్టును అప్పగించడానికే జీవీకే గ్రూప్‌పై వేధింపుల పర్వం కొనసాగించిందంటూ విపక్షాలు ధ్వజమెత్తాయి. ఇప్పుడు ఈ 12 ఎయిర్‌పోర్టుల విషయం లోనూ ఇదే తరహా ఒత్తిళ్లు, వేధింపులు కొనసాగుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.