న్యూడిల్లీ, డిసెంబర్ 23: ప్రపంచంలోని అతి పురాతనమైన వాటిలో ఒకటి, పర్యావరణానికి సహజ రక్షణ కవచంగా ఉన్న ఆరావళి పర్వతాల సమస్య ఇప్పుడు సామాజిక మాధ్యమంలో ట్రెండింగ్‌గా మారింది. దీంతో ‘ఆరావళిని రక్షించండి’ హ్యాష్‌టాగ్ విస్తృతంగా ట్రెండింగ్ అవుతున్నది. పర్యావరణ శాఖ నిర్దేశించిన ప్రమాణాన్ని అంగీకరిస్తూ, దానిని అమలు చేయాలని నవంబర్ 20న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై పలువురు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ దీనిపై నిరసన గళం విప్పుతున్నారు. భూమి ఉపరితలం నుంచి 100 మీటర్లు లేదా అంతకు మించి ఎత్తున ఉన్నవి మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణిస్తారు. లేదా ఒకదానికొకటి 500 మీటర్ల లోపల ఉన్న అలాంటి కొండల సమూహాలను ఆరావళి శ్రేణిలో భాగంగా గుర్తిస్తారు. అంతకన్నా తక్కువ ఎత్తున ఉన్నవి ఆరావళి పర్వత శ్రేణుల పరిధిలోకి రావంటూ ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
ఆరావళిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ఎత్తు ప్రాతిపదికన పర్వతాన్ని నిర్ణయించడం సబబు కాదని, ఇది దేశ పర్యావరణ పరిరక్షణ వ్యవస్థను బలహీనం చేస్తుందని పలువురు మేధావులు, పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పు కనుక అమలు చేస్తే దేశంలో 90 శాతం పర్వతాలు రక్షణ కోల్పోతాయని విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్, మైనింగ్ కార్యక్రమాలు సాగి పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. మైనింగ్, రియల్ మాఫియాకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తలొగ్గి ప్రకృతి విధ్వంసానికి దిగుతున్నదని వారు ఆరోపిస్తున్నారు.
మన దేశంలో 700 కి.మీ విస్తరించి ఉన్న ఆరావళి పర్వత శ్రేణులు మనకు సహజ రక్షణను కలిగిస్తున్నాయని చెప్పారు. ఇవి థార్ ఎడారి నుంచి వచ్చే దుమ్ము, ఇసుకను నిలువరిస్తున్నాయని, ఈ పర్వతాలే కనుక అడ్డుగా లేకపోతే థార్ ఎడారి ఢిల్లీ వరకు విస్తరిస్తుందన్నారు. అంతేకాకుండా ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్‌తో పాటు పలు రాష్ర్టాల్లో భూగర్భ జలవనరుల రీ చార్జింగ్కు ఇవి దోహదం చేస్తూ పలు రాష్ర్టాల జీవ వైవిధ్యాన్ని నిలుపుతున్నాయని వారు పేర్కొంటున్నారు.
సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సతత్ సంపద ైక్లెమేట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు హర్జీత్ సింగ్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఇచ్చిన 100 మీటర్ల ఎత్తు తీర్పుతో ఉత్తర భారత దేశాన్ని ఊపిరి పీల్చుకునే, బావులను పోషించే ప్రకృతి దృశ్యాన్ని తుడిచి పెట్టేస్తుందని వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు తీర్పును పేపర్‌పై చూస్తే అది సుస్థిర మైనింగ్, అభివృద్ధి కోసం అనిపిస్తుందని, కానీ వాస్తవానికి అది డైనమేట్ లాంటిదని, రోడ్లు, గ్రామ సమూహ అస్తులు నాశనం చేసి ఆకుపచ్చని కవచాన్ని విధ్వంసం చేస్తుందన్నారు.
ఆరావళిపై సుప్రీం తీర్పును నిరసిస్తూ గురుగ్రామ్, ఉదయ్‌పూర్‌లో పర్యావరణ వేత్తలు, స్థానికులు, వివిధ సంఘాల వారు ఈ నెల 20న నిరసన ప్రదర్శనలు జరిపారు. గురుగ్రామ్‌లో పెద్దయెత్తున తరలివచ్చిన పర్యావరణ వేత్తలు, పర్యావరణ పరిరక్షణ సంస్థల సభ్యులు, సామాజిక సంఘాలు, స్థానికులు హర్యానా పరిశ్రమల శాఖ మంత్రి నర్బీర్ సింగ్ ఇంటి బయట నిరసన తెలిపారు. ‘ఆరావళిని రక్షించండి, భవిష్యత్‌ను కాపాడండి, ఆరావళి లేకపోతే జీవితం లేదు’ అనే నినాదాలు రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు. ఆరావళికి ఇచ్చిన కొత్త నిర్వచనాన్ని నిరసిస్తూ ఉదయ్‌పూర్‌లో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు వీధులలో ప్రదర్శన చేసి విజ్ఞాపన పత్రాన్ని జిల్లా మేజిస్ట్రేట్‌కు సమర్పించారు.