న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఉద్యోగులను భారీగా తొలగించే బదులు జీతాల్లో కోత విధిస్తే బాగుంటుందని ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్ భావిస్తున్నది. కంపెనీ సీఈవో పాట్ జెల్సింగర్ బేస్ సాలరీలో 25 శాతం, ఆయన టీమ్ సభ్యుల జీతాల్లో 15 శాతం కోత విధించాలని అనుకొంటున్నది. యాపిల్ కంపెనీ ఇలాంటి విధానాన్నే పాటిస్తున్న నేపథ్యంలో తాము కూడా అదే దారిలో నడవాలని నిర్ణయించింది. తద్వారా 2023లో భారీగా ఉద్యోగులను తొలగించకుండా చూడవచ్చని ఇంటెల్ ఆలోచిస్తున్నది.
ఖర్చులను తగ్గించడంపై ‘టిండర్, హింగే పేరెంట్ మ్యాచ్ గ్రూప్’ దృష్టిసారించింది. ఇందులో భాగంగా మొత్తం ఉద్యోగుల్లో 8 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది. దీంతో దాదాపు 200 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ప్రస్తుతం ఈ గ్రూపునకు ప్రపంచవ్యాప్తంగా 2,500 మంది ఫుల్‌టైమ్ సిబ్బంది ఉన్నారు.