INS Aridhaman : భారత నావికాదళం మరింత బలపడింది. ఐఎన్ఎస్ అరిదమాన్ అనే అణు సామర్ధ్యం కలిగిన సబ్‌మెరైన్ శుక్రవారం భారత నావికాదళంలోకి చేరింది. ఇది అణుశక్తి కలిగిన బాలిస్టిక్ మిస్సైల్స్‌ను మోసుకెళ్లగలదు. నావికాదళంలో అణు సామర్ధ్యాన్ని పెంచాలన్న భారత లక్ష్యంలో భాగంగా దీన్ని తయారు చేశారు. ఐఎన్ఎస్ అరిదమాన్.. ఇప్పటికే ఈ తరహా సామర్ధ్యం కలిగిన ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అగిఘాట్ అనే సబ్మెరైన్ల సరసన చేరింది. మొదటి సబ్‌మెరైన్ 2016లో, రెండోది 2024లో నావికాదళంలోకి చేరాయి.
ప్రపంచంలో ఇలా అణుసామర్ధ్యం కలిగిన సబ్‌మెరైన్స్ (జలాంతర్గాములు) ఉన్న దేశాలు అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా మాత్రమే. షిప్ సబ్మెర్సిబుల్ బాలిస్టిక్ న్యూక్లియర్ (ఎస్ఎస్బీఎన్) ప్రోగ్రాంలో భాగంగా వీటిని తయారు చేస్తోంది ప్రభుత్వం. ఇవి దేశీయంగా తయారైన సబ్‌మెరైన్స్. 2009 నుంచి వీటిని తయారు చేస్తోంది. ఐఎన్ఎస్ అరిదమాన్ ఇప్పటికే సముద్రంలో పలు ట్రయల్స్ పూర్తి చేసుకుంది. ఇండియా ఇప్పటికే భూతల, గగనతల అణుసామర్ధ్యం కలిగి ఉంది. అందుకే ఇప్పుడు సముద్ర జలాల్లోంచి అణ్వాయుధాల్ని ప్రయోగించే సామర్ధ్యంపై దృష్టిపెట్టింది. ఇంకోవైపు, ఈ రోజే తారాగిరి అనే మరో యుద్ధనౌక కూడా జలప్రవేశం చేసింది. దీంతో ఈ భారీ నౌక కూడా ఇప్పుడు నావికాదళంలోకి చేరింది. విశాఖపట్నంలోని నేవల్ డాక్ యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నౌకను నావికాదళంలోకి చేర్చారు.
ఇది స్టెల్త్ సామర్ధ్యం కలిగి ఉంది. అంటే శతృవుల రాడార్‌కు, నిఘాకు దొరకకుండా పని చేస్తుంది. అలాగే, శతృవుల జాడను సులభంగా కనిపెట్టగలదు. ఈ విషయంలో కూడా అమెరికా, యుకే, రష్యా, ఫ్రాన్స్, చైనా తర్వాత ఈ జాబితాలో ఇండియా చోటు దక్కించుకుంది. ఇది ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన నాల్గవ యుద్ధ నౌక. 149 మీటర్ల పొడవు, 17.8 మీటర్ల వెడల్పు, 6,670 టన్నుల బరువు కలిగి ఉంది. దాదాపు 75 శాతం స్వదేశీ సాంకేతికతతో తయారైంది.