Narayana Murthy | న్యూఢిల్లీ : దేశం పురోగతి సాధించాలంటే యువత 70 గంటలు పనిచేయాల్సిందేనని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేర్కొన్నారు. కోల్‌కతాలో జరిగిన ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 70 గంటల పని విధానంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.
ఇన్ఫోసిస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోల్చినప్పుడు భారతీయులు చేయాల్సింది చాలానే ఉందని అనిపిస్తుందని చెప్పారు. దేశంలో ఇంకా 80 కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారని, దీనిని బట్టి వారంతా పేదరికంలో ఉన్నట్టేనని పేర్కొన్నారు. కాబట్టి మన ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలని సూచించారు. మనం కాకపోతే ఇంకెవరు కష్టపడతారని ప్రశ్నించారు.