H1B Visa | న్యూఢిల్లీ: అమెరికా జారీ చేసిన హెచ్1బీ వీసాలలో ఐదో వంతు భారత్‌కు చెందిన టెక్ కంపెనీలు దక్కించుకున్నాయి. అందులో ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్)లకు ఎక్కువ వీసాలు లభించాయని యూఎస్ ఇమ్మిగ్రేషన్ శాఖ ప్రకటించిన వివరాల్లో వెల్లడించింది. 2024 సెప్టెంబర్ నాటికి 1.3 లక్షల హెచ్1బీ వీసాలు జారీ కాగా, అందులో 24,766 భారత్‌కు చెందిన వివిధ కంపెనీలకు లభించాయి.
ఇందులో ఇన్ఫోసిస్‌కు 8,140, టీసీఎస్‌కు 5,274, హెచ్‌సీఎల్‌కు 2,953 వీసాలు దక్కాయి. మొత్తంపై అమెజాన్ కామ్ సర్వీసెస్ ఎల్ఎల్సీకి అత్యధికంగా 9,265 దక్కగా రెండో స్థానంలో ఇన్ఫోసిస్, 6,321తో కాగ్నిజెంట్ మూడో స్థానంలో నిలిచాయి. భారత్‌కు చెందిన విప్రోకు 1,634, టెక్ మహీంద్రాకు 1,199 వీసాలు మంజూరయ్యాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీలు తమ సంస్థలలో విదేశీ నిపుణులను తాత్కాలికంగా నియమించుకోవడానికి ఈ హెచ్1బీ వీసాలను జారీ చేస్తారు. ఈ వీసాల ద్వారా భారత్, చైనాకు చెందిన టెక్ నిపుణులు ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నారు.
వీసాల జారీలో 2025లో కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. హెచ్1బీ వీసా కోసం వ్యవస్థాపకులు తమను తాము స్పాన్సర్ చేసుకునేందుకు ఈ నిబంధన అనుమతి ఇస్తుంది. యూఎస్‌లో టెక్ కంపెనీని స్థాపించే వ్యవస్థాపకులు వీసా కోసం అర్హత ప్రమాణాలు, స్వీయ జ్ఞానం కలిగి ఉంటే స్వీయ స్పాన్సర్ చేయవచ్చు. ఇప్పటివరకు స్పాన్సరింగ్ సంస్థలలో ఉద్యోగం చేస్తే తప్ప హెచ్1బీ వీసాలకు అర్హులుగా పరిగణించే వారు కాదు. స్వతంత్రంగా వ్యాపారాలను ప్రారంభించాలనుకునే వారికి ఉపాధి అనుమతి పొందడం కష్టంగా ఉండేది.
న్యూజిలాండ్‌లో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు ఇది శుభవార్త! ఉద్యోగులు, కార్మికుల కొరత వేధిస్తుండటంతో వీసా నిబంధనలను న్యూజిలాండ్ సరళతరం చేసింది. వీసా దరఖాస్తుదారులకు ఉండవలసిన వర్క్ ఎక్స్‌పీరియెన్స్‌ను మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించింది. అనుభవజ్ఞులైన సీజనల్ వర్కర్స్ కోసం మూడేళ్ల మల్టీ ఎంట్రీ వీసాను, తక్కువ నైపుణ్యంగల కార్మికుల కోసం ఏడు నెలల సింగిల్ ఎంట్రీ వీసాను జారీ చేయాలని నిర్ణయించింది.
సీజనల్ లేబర్ డిమాండ్‌ను అధిగమించడం కోసం ఈ చర్యలను చేపట్టింది. వర్కర్లకు వేతనాలు చెల్లించే విషయంలో యజమానులపై ఉన్న నిబంధనలను కూడా సరళతరం చేసింది. దీంతో వేతనాల విషయంలో యాజమాన్యాలకు స్వేచ్ఛ లభిస్తుంది. లెవెల్ 4 లేదా 5 ఉద్యోగాల కోసం స్థానికులను నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా యాజమాన్యాలు చెప్పుకోవడానికి గతంలో ఉన్న కఠినమైన నిబంధనలను న్యూజిలాండ్ ప్రభుత్వం తొలగించింది.