Barauni-Gwalior Express | బరౌనీ-గ్వాలియర్ ఎక్స్‌ప్రెస్ (Train No 11124)లో బాంబు ఉందంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే భారీగా పోలీసుల బలగాలు, అగ్నిమాపక దళాలు, బాంబ్ డిస్పోజల్స్ బారాబంకి రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేసి సోదాలు నిర్వహించారు. దాదాపు స్టేషన్లో గంట వరకు రైలు నిలిచిపోయింది. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ అన్ని కోచ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఎలాంటి బాంబు లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పోలీసుల తనిఖీలతో ప్రయాణికులందా ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. నార్త్ ఏఎస్పీ చిరంజీవ్నాథ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్వాలియర్ బరౌనీ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందని ఆదివారం ఉదయం 9.32 గంటలకు సమాచారం అందింది. సుమారు ఎనిమిది నిమిషాల తర్వాత పోలీసులు, అగ్నిమాపక దళాలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బారాబంకి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాయి. గోరఖ్‌పూర్ నుంచి వస్తున్న రైలును వెంటనే వెంటనే నిలిపివేశారు.
భారీ పోలీసు బలగాలు రైలులోకి ప్రవేశించి ప్రతి కంపార్ట్మెంట్లలో తనిఖీలు చేశారు. ఉదయం 9.42 గంటల నుంచి 10.32 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది సైతం స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. భారీగా బలగాలు తనిఖీలు నిర్వహించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చివరకు తప్పుడు సమాచారమని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తనిఖీల అనంతరం రైలు ఆలస్యంగా బయలుదేరి వెళ్లింది.