Karnataka | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ఐటీ, ఐటీఈఎస్, పరిశ్రమలు, కర్మాగారాలు ఇలా అన్ని రకాల ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం తీవ్ర కలకలం రేపుతున్నది. సిద్ధరామయ్య సర్కారు నిర్ణయాన్ని ఐటీ ఇండస్ట్రీ సమాఖ్య నాస్కామ్ సహా పలువురు వ్యాపారవేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో లోకల్ బిల్లుపై యూటర్న్ తీసుకుంది. బిల్లును నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
ఏమిటీ నిర్ణయం?
కర్ణాటకలోని అన్ని ప్రైవేటు కంపెనీల్లోని ఉద్యోగాల్లో స్థానికులకే 100 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వీలు కల్పించే బిల్లుకు సోమవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య సోమవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పరిశ్రమల్లో సీ, డీ గ్రేడ్ పోస్టులకు సంబంధించి 100 శాతం కన్నడిగులనే నియమించేలా వీలు కల్పించే బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది’ అని సీఎం పేర్కొన్నారు. అయితే, ఈ నిర్ణయంపై పారిశ్రామిక వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమయ్యింది. ఈ క్రమంలో తన పోస్ట్‌ను తొలగించిన సిద్ధరామయ్య.. ‘ప్రైవేటు సంస్థల్లో నాన్ మేనేజ్మెంట్ పోస్టుల్లో 70 శాతం, మేనేజ్మెంట్ పోస్టుల్లో 50 శాతం పోస్టులను మాత్రమే కన్నడిగులకు కేటాయించాల’ని తాము నిర్ణయించినట్టు వెల్లడించారు. కర్ణాటకలో పుట్టినవారు, 15 ఏండ్లుగా రాష్ట్రంలో నివసిస్తున్నవారిని స్థానికులుగా గుర్తిస్తారు. కన్నడ భాషలో మాట్లాడుతూ, రాయగలిగినప్పటికీ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ గనుక లేకపోతే.. రాష్ట్ర నోడల్ ఏజెన్సీ నిర్వహించే అర్హత పరీక్షలో నెగ్గినవారిని స్థానిక అభ్యర్థిగా పరిగణించనున్నట్టు బిల్లులో పేర్కొన్నారు.
భగ్గుమన్న పారిశ్రామికవేత్తలు
కర్ణాటక ప్రభుత్వ తాజా నిర్ణయంపై పారిశ్రామికవేత్తలు మండిపడ్డారు. ఇలాంటి అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్రం నుంచి కంపెనీలు మరోచోటుకు తరలివెళ్లిపోతాయని, కొత్తగా వచ్చే పెట్టుబడులకు కూడా ఈ నిర్ణయం అడ్డంకిగా మారుతుందని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ విమర్శించారు. ఇలాంటి ఫాసిస్ట్ నిర్ణయాలు తీసుకోవడం కంటే స్థానిక యువత నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు దృష్టిసారిస్తే ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వానికి చురకలు అంటించారు. అధిక నైపుణ్యం ఉన్న సిబ్బంది నియామకాల విషయంలో ఈ బిల్లు నుంచి మినహాయింపునివ్వాలని, లేకపోతే కష్టమని బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా అభిప్రాయపడ్డారు.
కంపెనీలకు ఏపీ, కేరళ ఆహ్వానం
కర్ణాటక ప్రభుత్వం తీసుకువచ్చిన లోకల్ బిల్లుతో అసంతృప్తిగా ఉన్న కంపెనీలను ఆంధ్రప్రదేశ్, కేరళ ఆహ్వానించాయి. విశాఖలో కంపెనీలు ఏర్పాటు చేయాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ ద్వారా ఆహ్వానించారు. మరోవైపు కేరళ పరిశ్రమల శాఖ మంత్రి పీ రాజీవ్ సైతం ‘కేరళ కాలింగ్’ హ్యాష్‌ట్యాగ్‌తో పరిశ్రమలను తమ రాష్ర్టానికి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు.
ఇంకా రూపకల్పన దశలోనే బిల్లు: సిద్ధరామయ్య
లోకల్ బిల్లుపై వ్యతిరేకత రావడంతో ఈ బిల్లు ఇంకా రూపకల్పన దశలోనే ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ బిల్లుపై వచ్చే క్యాబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.
అసంతృప్తితో ఉన్నాం
కర్ణాటక సర్కారు తీసుకొన్న నిర్ణయంపై మేము తీవ్ర ఆందోళనతో, అసంతృప్తితో ఉన్నాం. ఇలాంటి నిబంధనలతో కంపెనీలు వేరే ప్రాంతాలకు తరలివెళ్లే ప్రమాదమున్నది. స్థానికంగా తగిన నైపుణ్యాలున్న వాళ్లు లభించనప్పుడు కంపెనీలకు తరలివెళ్లడం తప్ప, వేరే మార్గం కనిపించబోదు. –నాస్కామ్