న్యూఢిల్లీ: హైటెక్ మోసాలతో ఎంతోమంది ప్రముఖులను బురిడీ కొట్టించిన సైబర్ మోసగాళ్లు తాజాగా ఓ పారిశ్రామికవేత్తను తమ బుట్టలో వేసుకున్నారు. బాధితుడిని అతని ఇంట్లోనే రెండు రోజులపాటు డిజిటల్ అరెస్ట్ చేసిన దుండగులు.. ఆయన నుంచి రూ.7 కోట్లు తస్కరించారు. ఇందుకోసం ఏకంగా ఓ ఫేక్ సుప్రీంకోర్టును, నకిలీ సీజేఐని సృష్టించారు. తాము సీబీఐ, ఈడీ అధికారులమంటూ బాధితుడిని ఆన్లైన్లో విచారణ చేసి, ఆయన వాంగ్మూలాన్ని రికార్డుచేసి, ఆన్లైన్లోనే కోర్టులో హాజరుపరిచారు. ఆయనపై నేరారోపణ చేసి.. శిక్షగా రూ.7 కోట్లు జరిమానా విధించి వివిధ అకౌంట్లలోకి ఆ డబ్బును జమచేయించుకున్నారు. ఈ హైటెక్ మోసానికి గురైన వ్యక్తి ప్రముఖ వస్త్ర ఉత్పత్తి సంస్థ వర్ధమాన్ గ్రూప్ చైర్మన్ ఎస్పీ ఓస్వాల్.
ఓస్వాల్ కథనం ప్రకారం ఆయనకు సెప్టెంబర్ 28న ఒక ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే 9 నంబర్ నొక్కాలని అప్పటివరకు ఫోన్ డిస్కనెక్ట్ కాదని అవతలి వ్యక్తి చెప్పాడు. దీంతో ఓస్వాల్ 9 నంబర్ నొక్కాడు. వెంటనే అవతలి నుంచి ఒక వ్యక్తి తాను సీబీఐ కొలాబా (ముంబై) ఆఫీసు నుంచి మాట్లాడుతున్నానని అంటూ ఒక ఫోన్ నంబర్ చెప్పి అది ఓస్వాల్ పేరిట ఉందని చెప్పాడు. ఎవరో తన పేరుతో ఆ నంబర్ తీసుకొని వాడుతున్నారని అన్నాడు. అలాగే కెనరా బ్యాంక్‌లో తన పేరిట ఒక అకౌంట్ ఉన్నదని కూడా చెప్పాడు. దీంతో ఓస్వాల్ వెంటనే తనకు కెనరా బ్యాంక్‌లో ఎటువంటి ఖాతా లేదని చెప్పాడు. కానీ అవతలి వ్యక్తి.. అది ఓస్వాల్ పేరుతోనే ఉన్నదని, ఆ ఖాతా నుంచి అక్రమంగా కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయని అన్నాడు. గత ఏడాది హవాలా కేసులో అరెస్టయిన జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేశ్ గోయల్ కేసుకు సంబంధించి ఈ ఆర్థిక లావాదేవీలు జరిగాయని చెప్పాడు. ఈ కేసులో ఓస్వాల్ కూడా అనుమానితునిగా ఉన్నాడని అన్నాడు. ఆ అకౌంట్ తనది కాదని, తనకు నరేశ్ గోయల్ ఎవరో తెలియదని ఓస్వాల్ చెప్పారు. అయినప్పటికీ.. ఆ బ్యాంకు ఖాతా తన ఆధార్‌కార్డు ఆధారంగా ఉన్నదని అవతలి వ్యక్తి చెప్పాడు. తాను అప్పుడప్పుడు జెట్ ఎయిర్వేస్లో ప్రయాణించానని, బహుశా గుర్తింపు కార్డుగా తన ఆధార్‌కార్డును వారికి చూపించి ఉంటానని ఓస్వాల్ చెప్పారు. అయినాసరే.. తమ దర్యాప్తు పూర్తయ్యేంత వరకు తనను డిజిటల్ కస్టడీలో ఉండాలని చెప్పారని, తమకు సహకరిస్తే కేసు నుంచి బయటపడేస్తామని కూడా వారు హామీ ఇచ్చారన్నారు. ఇదంతా వీడియో కాల్లో జరిగిందని ఓస్వాల్ వివరించారు. తనతో మాట్లాడిన వ్యక్తి చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాహుల్ గుప్తాగా చెప్పుకున్నాడని తెలిపారు. డిజిటల్ కస్టడీలో ఉన్న తనపై నిఘా వేసినట్టు తెలుపుతూ 70 నిబంధనలను తనకు పంపించారని చెప్పారు. దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతూ తనను ఒక లేఖ రాయమన్నారని, వెంటనే తాను రాసి పంపానని తెలిపారు. ఆ తరువాత ఆ మోసగాళ్లు తన వాంగ్మూలం కూడా తీసుకున్నారని చెప్పారు.
తన బాల్యం నుంచి వ్యాపారం వరకు, ఆస్తి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారని అన్నారు. అయితే తనకు అన్ని వివరాలు గుర్తు లేవని, మేనేజర్‌ను అడిగి చెప్తానని అన్నానని తెలిపారు. తనను రెండురోజుల పాటు వీడియో సర్వేలెన్స్‌లో ఉంచారని, తాను గది నుంచి బయటకు వెళ్లినప్పుడల్లా ఫోన్‌ను తనతో తీసుకెళ్లాలని ఆదేశించారని చెప్పారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని బెదిరించిన దుండగులు.. ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పవద్దని ఆదేశించారని అన్నారు. తాను ఎవరితోనైనా మాట్లాడితే.. తనతోపాటు ఆ వ్యక్తి కూడా ఐదేండ్ల పాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారని చెప్పారు. దర్యాప్తు అధికారులుగా చెప్పుకున్న ఆ దుండగులు సాధారణ దుస్తులే ధరించారని, వారి మెడలో ఐడీ కార్డులున్నాయని తెలిపారు. వారి వెనుక జాతీయజెండా ఎగురుతున్న ఓ భవనాన్ని తాను చూశానని చెప్పారు. ఆ తరువాత ఒక నకిలీ కోర్టు హాల్‌ను చూపించారని, అక్కడ భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌గా చెప్పుకున్న వ్యక్తి తన కేసును విచారించి, ఆదేశాలు కూడా ఇచ్చాడని ఓస్వాల్ తెలిపారు. కోర్టు ఉత్తర్వులు తనకు వాట్సాప్‌లో పంపారని, రూ.7 కోట్లను వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు పంపాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారని చెప్పారు. ఇక తనపై జారీ అయిన ఓ ఫేక్ అరెస్ట్ వారంట్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లోగో, ముంబై పోలీసుల స్టాంపులు ఉన్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులుగా పేర్కొన్న పత్రం మీద మూడు రెవెన్యూ స్టాంపులు ఉన్నాయని, వాటిలో ఒకటి సుప్రీంకోర్టు స్టాంప్, రెండు బార్ అసోసియేషన్ స్టాంప్లని వివరించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మీద ఉన్నట్టుగానే తనకు అందిన ఆదేశాలపై కూడా డిజిటల్ సంతకం, బార్ కోడ్ ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా దానిపై సుప్రీంకోర్టు చిహ్నం కూడా ఉన్నదని అన్నారు. ఇవన్నీ చూసి.. జరుగుతున్నదంతా నిజమేనని భావించానని, వారు తనను ఈ కేసు నుంచి రక్షిస్తారని భ్రమపడ్డానని ఓస్వాల్ చెప్పారు.
తాను మోసపోయానని గ్రహించిన ఓస్వాల్ ఆగస్ట్ 31న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ క్రైమ్ విభాగం సహకారంతో డబ్బు బదిలీ అయిన అకౌంట్లను జప్తుచేసి రూ.5.25 కోట్లను స్వాధీనం చేసుకొని ఓస్వాల్‌కు అప్పగించారు. ఈ నేరం వెనుక అంతర్రాష్ట్ర ముఠా ఉన్నదని, అస్సాంకు చెందిన ఇద్దరు చిన్న వ్యాపారులు అతాను చౌదరి, ఆనంద్‌కుమార్‌ను అరెస్టు చేశామని తెలిపారు. ప్రధాన నిందితుడు మాజీ బ్యాంక్ ఉద్యోగి రూమీ కలీటా అని, ఇతనికి నిమ్మీ భట్టాచార్య, అలోక్ రంగీ, గులాం ముర్తజా, జకీర్ సహకరించారని వివరించారు.