Indrani Mukerjea : దశాబ్దకాలం దాటినా షీనాబోరా (Sheena Bora) హత్య కేసు (Murder case) ఇంకా అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. ఇంద్రాణి ముఖర్జియా (Indrani Mukerjea), ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా (Sanjeev Khanna) నిందితులుగా ఉన్న ఈ కేసులో వారి కుమార్తె విధి ముఖర్జియా (Vidhie Mukerjea) కీలక సాక్షిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విధి ముఖర్జియా తాజాగా కోర్టుకు హాజరయ్యారు. గతంలో తాను సీబీఐ ముందు వాంగ్మూలం ఇచ్చినట్టుగా కేసు దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారని, వాస్తవానికి తాను ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని చెప్పారు.
అదేవిధంగా ఈ కేసును వాదించుకోవడానికి తన తల్లి వద్ద పైసా కూడా లేదని విధి తెలిపారు. ఆమెకు చెందిన ఆభరణాలు, రూ.7 కోట్ల నగదును తన తల్లి మాజీ భర్త, మీడియా దిగ్గజం పీటర్ ముఖర్జియా కుమారులు రాహుల్, రాబిన్ దొంగిలించారని ఆమె ఆరోపించారు. కుట్రపూరితంగా ఇంద్రాణిని కేసులో ఇరికించారని సీబీఐ న్యాయమూర్తి ఎదుట విధి వాపోయారు. తన తల్లి అరెస్ట్ జరిగినప్పుడు తాను మైనర్‌నని, ఆ సంఘటన నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నానని చెప్పారు.
కేసు విచారణలో భాగంగా ముంబయి పోలీసుల ఎదుట తాను సాక్షిగా హాజరైన విషయాన్ని విధి ముఖర్జియా అంగీకరించారు. సీబీఐ అడిగిన పలు ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానన్నారు. అయితే పోలీసులు, సీబీఐ ప్రస్తుతం చూపుతున్న వాంగ్మూలాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. విచారణ అధికారులు తనతో కొన్ని కాగితాలపై బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపించారు. అవన్నీ పూర్తిగా ఫోర్జరీ చేసినవని కొట్టిపారేశారు. దురుద్దేశంతో వాటిని తయారు చేశారన్నారు.
తన బయోలాజికల్ తల్లిదండ్రులు అయిన ఇంద్రాణి, సంజీవ్‌లను మరింత ఇరికించాలనే కొందరు ఈ ప్రయత్నం చేశారని విధి విమర్శించారు. మృతురాలు షీనాబోరా తనను తాను ఇంద్రాణీ ముఖర్జియా సోదరిగా పరిచయం చేసుకున్నట్లు విధి చెప్పారు. తొలుత ఇంద్రాణీ, షీనా సన్నిహితంగా ఉన్నప్పటికీ.. పీటర్ కుమారుడు రాహుల్ ముంబైలోని వర్లీ ఫ్లాట్‌కు రావడం మొదలైనప్పటి నుంచి వారి మధ్య విభేదాలు తలెత్తాయని వెల్లడించారు.
షీనా, రాహుల్ డ్రగ్స్ తీసుకుంటున్నారనే విషయం తెలిశాక పరిస్థితి మరింత దారుణంగా తయారైందని విధి చెప్పారు. షీనాబోరాను తాను 2011లో చివరిసారి గోవాలో జరిగిన ఓ వివాహంలో కలిశానని తెలిపారు. 2013 వరకు ఈ మెయిల్ ద్వారా తమ మధ్య సందేశాలు నడిచాయన్నారు. ఇంద్రాణి అరెస్టు తర్వాత ఆమె వస్తువుల కోసం కొందరు బంధువులు ఇంటికి వచ్చి గొడవ చేశారని, విలువైన ఆభరణాలు, రూ.7 కోట్ల బ్యాంకు నిల్వలు దోచుకున్నారని ఆరోపించారు.
ఎత్తుకెళ్లిన వాటిని దాచుకునేందుకు రాహుల్, రాబిన్ కొత్త బ్యాంక్ లాకర్ తెరిచారని చెప్పారు. పీటర్ ముఖర్జియా ప్రమేయం లేకుండా వారు ఇలా చేయరని విధి అభిప్రాయపడ్డారు. రాహుల్‌కు ఉద్యోగం లేదని, రాబిన్ ఆర్థికంగా స్థితిమంతుడు కాదన్నారు. కాగా 2012లో షీనా బోరాను ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, డ్రైవర్ శ్యామ్రాయ్, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాలు హత్య చేసినట్లు కేసు నమోదైంది. 2015లో ఓ ఆయుధాల కేసులో శ్యామ్ అరెస్టు కావడంతో షీనా హత్య కేసు వెలుగులోకి వచ్చింది.
దాంతో పోలీసులు ఇంద్రాణి, సంజీవ్, పీటర్లను అరెస్టు చేశారు. ఈ హత్య తర్వాత కూడా షీనా బతికే ఉందని నమ్మించేందుకు ఆమె మెయిల్ నుంచి ఇంద్రాణి సందేశాలు పంపించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.