Emergency 1975 | న్యూఢిల్లీ, జూన్ 24 : 1975 జూన్ 25.. దేశంలో నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ విధించిన 21 నెలల అత్యయిత పరిస్థితి ప్రారంభమైన రోజు. సరిగ్గా నేటికి 50 సంవత్సరాల క్రితం మొదలైన ఆ చీకటి అధ్యాయం నేటికీ స్వతంత్ర భారతాన్ని వెంటాడుతూనే ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఇందిరా గాంధీ హయాంలో ఓ 21 నెలల పాటు అంధయుగాన్ని చవిచూసింది. ప్రసార మాధ్యమాల గొంతు నొక్కడంతోపాటు రాజకీయ ప్రత్యర్థులను, పాత్రికేయులను జైళ్లలో కుక్కిన పాడుకాలమది. తమ హక్కులకు భంగం వాటిల్లితే న్యాయస్థానాలను ఆశ్రయించే స్వేచ్ఛ పౌరులకు లేకుండా హరించి వేసిన చీకటి రోజులవి. ఇందిర తనయుడు సంజయ్ గాంధీ దుందుడుకు చర్యలతో పెట్రేగిపోయి అమలుచేసిన నిర్బంధ కుటుంబ నియంత్రణ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పేద కుటుంబాల వారిని ఇళ్లలోంచి బయటకు లాగి మరీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. అవి వికటించి కొందరు అసువులు బాశారు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిర నిరంకుశ పాలన దేశ ప్రజలలో భయోత్పాతాన్ని సృష్టించింది.
దేశంలో రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధించారు. భయపడాల్సిన పని లేదు అని ఇందిరా గాంధీ అదే రోజున ఆల్ ఇండియా రేడియోలో చెప్పిన మాట. ఆమె మాటలు భారత ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. అదే సమయంలో భారత దేశ ప్రజాస్వామిక చరిత్రలో చెరిగిపోని చేదు జ్ఞాపకాలకు కూడా అప్పుడే అంకురార్పణ జరిగింది. నాటి ప్రధాని ఇందిరా గాంధీ సూచన మేరకు ఆనాటి రాష్ట్రపతి ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగంలోని 352 అధికరణ కింద దేశవ్యాప్తంగా అత్యయిక స్థితిని విధించారు. ఆ స్థితి 1977 మార్చి 21 వరకు 21 నెలలపాటు కొనసాగింది. ఎమర్జెన్సీ కాలంలో జరిగిన ఘోరాలు, రాజ్యాంగ ఉల్లంఘనలు, ప్రజాస్వామిక విలువల పాతరను పురస్కరించుకుని జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్య దినం(సంవిధాన్ హత్య దివస్)గా పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దేశ పౌరులు తమ హక్కులు కోల్పోయారు. రాజకీయ నాయకులు, నిరసనకారులు జైలు పాలయ్యారు. పత్రికా స్వేచ్ఛ కనుమరుగైంది. ఒకే వ్యక్తి చేతిలో అధికారం బందీ అయింది. ఆ వ్యక్తే ఇందిరా గాంధీ. ఆమె ఇష్టానుసారం నిబంధనలు మారిపోయాయి. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ, మధు దండావతె, జార్జి ఫెర్నాండేజ్ వంటి రాజకీయ ప్రముఖులు జైలు పాలయ్యారు.
వార్తాపత్రికలలో ప్రచురించే ప్రతి అక్షరం ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా బయటకు వచ్చాయి. ఇందుకు నిరసనగా అనేక పత్రికలు సంపాదకీయాల స్థానాన్ని ఖాళీగా ఉంచాయి. ప్రభుత్వాన్ని కాని ఎమర్జెన్సీని కాని విమర్శించిన ప్రచురణ సంస్థలు నిషేధానికి గురయ్యాయి. ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ దేశంలో నిర్బంధ కుటుంబ నియంత్రణ చేపట్టారు. ఒక్క 1976 సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా లక్షలాది సంఖ్యలో కు.ని. ఆపరేషన్లు జరిగాయంటే ఎంత హడావుడిగా, బలవంతంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమం నిర్వహించారో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలోని తుర్క్‌మాన్ గేట్ ప్రాంతంలో నివసించే పేదలను బలవంతంగా వారి ఇళ్ల్ల నుంచి గెంటేశారు. సుందరీకరణ చర్యలలో భాగంగా వారి ఇళ్లను రాత్రికి రాత్రే కూల్చేశారు. ‘అధికారులు మాకు ముందుగా ఎటువంటి హెచ్చరికలు ఇవ్వలేదు. అడ్డుకున్న నా భర్తను కాల్చడంతో ఆయన కాలి నుంచి తూటా దూసుకుపోయింది. మా ఇంటి ముందే నా భర్త పడిపోగా మా కళ్ల ముందే ఇంటిని కూల్చేశారు’ అని 74 ఏళ్ల మెహ్రూ నిషా ఆనాటి కాళరాత్రిని తలుచుకుని కన్నీరు మున్నీరయ్యారు. ఆ ప్రాంత ప్రజలు నిరాశ్రయులయ్యారు. వైద్యం లేదు, టాయిలెట్లు లేవు, తినడానికి తిండి లేదు, వండుకోవడానికి వస్తువులు లేకుండా రోడ్డునపడ్డారు.
జాతీయ ఎమర్జెన్సీ కాలంలో ప్రజలకు హెబియస్ కార్పస్ హక్కుతోసహా తమ ప్రాథమిక హక్కుల అమలు కోసం ఏ న్యాయస్థానాన్ని ఆశ్రయింలే హక్కు లేదని భారత అత్యున్నత న్యాయస్థానం 4:1 మెజారిటీతో సంచలన తీర్పును వెలువరించింది. (ఏడీఎం జబల్పూర్, శివకాంత్ శుక్లా కేసు(1976).
ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టి చట్టాలలో పెనుమార్పులు తీసుకువచ్చింది. ఆ మార్పులు ఎంత విస్తారంగా ఉన్నాయంటే వాటిని మినీ రాజ్యాంగంగా అభివర్ణించడం జరిగింది. రాజ్యాంగానికి గుండెలాంటి పీఠికను ఇందిరా గాంధీ ప్రభుత్వం మార్చివేసింది. సోషలిస్టు, సెక్యులర్, ఇంటగ్రిటి పదాలను పీఠికలో చేర్చింది. స్వరణ్ సింగ్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా 1976లో రాజ్యాంగానికి 10 ప్రాథమిక విధులను ప్రభుత్వం జతచేసింది. ఎమర్జెన్సీలో ఈ విధులు ప్రాథమిక హక్కులను మించి అమలు జరిగాయి. రాజ్యాంగంలో తీసుకువచ్చిన పలు సవరణలు న్యాయవ్యవస్థ అధికారాలను కట్టడి చేశాయి. రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దార్శనికతతో పార్లమెంట్, న్యాయ వ్యవస్థ మధ్య పరస్పర నియంత్రణ, సమతుల్యత ఉండాలన్న ఆకాంక్షకు తూట్లు పొడుస్తూ పార్లమెంటే అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థగా మార్చడానికి ఇందిర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
1971లో రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు పోటీచేసిన ఇందిరాగాంధీ ఆ ఎన్నికల్లో అవినీతికి పాల్పడ్డారన్న కారణంతో 1975లో అలహాబాద్ హైకోర్టు ఆమెను ప్రధాని పదవికి అనర్హురాలిగా స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేండ్లు నిషేధం విధించింది. ప్రధాని పీఠాన్ని విడిచిపెట్టడం ఇష్టంలేని ఇందిర.. అంతకుముందు ఎప్పుడూ ఉపయోగించని ‘అత్యయిక స్థితి’ని విధించారు.
ద్రవ్యోల్బణం 29%
ధాన్యం ఉత్పత్తి (-)9.5%
జీడీపీ వృద్ధిరేటు 0.9%
ఎమర్జెన్సీ సమయంలో పౌరులపై జరిగిన ఆకృత్యాలకు తాను కూడా ఒకరకంగా పరోక్షంగా కారణమయ్యానని భావిస్తూ అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కిషన్‌చంద్ 1978లో తన నివాసం వెనుక ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సూసైడ్ నోట్లో ‘జిల్లత్ కీ జిందగీ సే మౌత్ బేహ్తర్ హై (అవమానకరమైన జీవితం కంటే మరణమే మేలు)’ అని రాశారు.
1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఓటమిని చవిచూసింది. మోరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతాపార్టీ విజయం సాధించింది. కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం, తొలి కాంగ్రెసేతర ప్రధాని కొలువుదీరారు.
1, గుజరాత్లో అలజడి
1973లో ఫీజుల పెంపు గుజరాత్ వ్యాప్తంగా విద్యార్థుల నిరసనలకు దారితీసింది. ముఖ్యమంత్రి చిమన్‌భాయ్ పటేల్‌పై చిమన్ చోర్అనే ముద్ర పడింది. దీంతో 1974 ఫిబ్రవరిలో గుజరాత్ ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఇందిరా గాంధీ రాష్ట్రపతి పాలన విధించారు.
2. బీహార్‌లో జేపీ ఉద్యమం
బీహార్ సీఎం అబ్దుల్ గఫూర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థి ఉద్యమంలో గాంధేయవాది జయప్రకాశ్ నారాయణ్(జేపీ) చేరారు. ఈ ఉద్యమం లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వంటి భావి నాయకులను సృష్టించింది. సంపూర్ణ క్రాంతి(సంపూర్ణ విప్లవం), ఇందిరా గాంధీ తొలగింపునకు జేపీ పిలుపునిచ్చారు.
3. ఫెర్నాండేజ్ సారథ్యంలో రైల్వే సమ్మె
కార్మిక నాయకుడు జార్జి ఫెర్నాండేజ్ సారథ్యంలో 1974లో బ్రహ్మాండమైన రైల్వే సమ్మె జరిగింది. దేశవ్యాప్తంగా ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి. అదే సమయంలో ఆనాటి రైల్వే మంత్రి, బీహార్ ఎంపీ ఎల్ఎన్ మిశ్రా బాంబు దాడిలో మరణించడంతో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగాయి.
4. ఇందిరపై కేసు
ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సోషలిస్టు నాయకుడు రాజ్ నారాయణ్ 1971లో ఇందిరా గాంధీ గెలుపును అలహాబాద్ హైకోర్టులో సవాలు చేశారు. 1975 జూన్ 12న ఇందిరని దోషిగా తేల్చిన జస్టిస్ జగ్మోహన్లాల్ సిన్హా ఆమె ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చారు. అదే సమయంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. జూన్ 24న ఇందిర ఎన్నికపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే మంజూరు చేసిన సుప్రీంకోర్టు ఓటింగ్ హక్కులు లేకుండా ఆమె ప్రధానిగా కొనసాగడానికి అనుమతి ఇచ్చింది.
1975 జూన్ 25న జేపీ నారాయణ్, మొరార్జీ దేశాయ్, ఇతర నాయకులు ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ర్యాలీ నిర్వహించి రాజ్యాంగ వ్యతిరేక ఉత్తర్వులను ధిక్కరించాలని పోలీసులు, సైన్యానికి పిలుపునిచ్చారు. అదే రోజు రాత్రి తన కుమారుడు సంజయ్ గాంధీతో కలసి దేశంలో ఎమర్జెన్సీ విధించాలని ఇందిరా గాంధీ నిర్ణయించారు. మరుసటి రోజు సూర్యోదయం నుంచి 21 నెలలు అమలులోఉంది