IndiGo | కొద్దిరోజులుగా తమ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడటంపై దేశీయ విమానయాన సంస్థ ఇండిగో బహిరంగంగా క్షమాపణలు తెలిపింది. వందల సర్వీసులు రద్దు, ఆలస్యం కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వివరణ ఇచ్చింది. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా బహిరంగ ప్రకటన విడుదల చేసింది.
కొన్నిరోజులుగా పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నాయో మేం అర్థం చేసుకోగలమని ఇండిగో సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. అనేక విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చిందని, ఇందుకు సంస్థ హృదయపూర్వక క్షమాపణలు కోరింది. ఇవాళ అత్యధికంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపింది. సిస్టమ్ రిబూట్, షెడ్యూల్ మెరుగుదలకు అవసరమని పేర్కొంది. ప్రయాణికులకు సహకరించేందుక, కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకొచ్చిందేకు కృషి చేస్తున్నామని తెలిపింది. గత 19 ఏళ్లుగా వినియోగదారులు చూపిన ప్రేమను కోల్పోమని.. మీ విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు నిరంతరంగా మెరుగుదలకు కృషి చేస్తామని ఇండిగో స్పష్టం చేసింది. తమ ఫ్రంట్‌లైన్ సిబ్బంది సహా మొత్తం బృందం కార్యకలాపాల పునరుద్ధరణకు కట్టుబడి ఉందని వెల్లడించింది. రేపటి నుంచి ఆపరేషన్లు క్రమంగా మెరుగుపడతాయని తెలిపింది.
రద్దయిన ఫ్లైట్లకు సంబంధించి రీఫండ్ ఆటోమెటిగ్గా ఇచ్చేస్తామని ఇండిగో సంస్థ తెలిపింది. డిసెంబర్ 5వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య టికెట్లు బుక్ చేసుకుని.. ఈ అంతరాయాల కారణంగా వాటిని రద్దు లేదీ రీషెడ్యూలింగ్ చేసుకుంటే పూర్తి రీఫండ్ ఇస్తామని ప్రకటించింది. కస్టమర్ల సౌకర్యం కోసం దేశవ్యాప్తంగా వేలాది హోటల్ గదులు, రవాణా సదుపాయాలను ఏర్పాటు చేశామని తెలిపింది. ఎయిర్‌పోర్టులో నిరీక్షిస్తున్న కస్టమర్ల కోసం భోజనం, స్నాక్స్ అందిస్తున్నామని పేర్కొంది. వృద్ధులకు లాంజ్ యాక్సెస్ అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపింది.
సర్వీసుల్లో అంతరాయం నేపథ్యంలో కస్టమర్లకు ఇండిగో సంస్థ పలు సూచనలు చేసింది. మీ ఫ్లైట్ రద్దయితే ఎయిర్‌పోర్టుకు రావద్దని కస్టమర్లకు సూచించింది. వెబ్సైట్, నోటిఫికేషన్ల ద్వారా ఫ్లైట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని తెలిపింది. కస్టమర్ కాంటాక్ట్ సెంటర్‌కు రద్దీ కారణంగా వెయిట్ టైమ్ పెరిగినందుకు క్షమాపణలు చెబుతూ.. ఏఐ అసిస్టెంట్ 6Eskai ద్వారా ఫ్లైట్ స్టేటస్, రీఫండ్, రీబుకింగ్‌లు చెక్ చేసుకోవాలని కోరింది.

Indigo