IndiGo | బెంగళూరు నుంచి మాలె బయలుదేరిన ఇండిగో విమానం మంగళవారం మధ్యాహ్నం అత్యవసరంగా కోచి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం తలెత్తడం వల్లే అత్యవసరంగా కోచి విమానాశ్రయానికి మళ్లించామని ఇండిగో, కోచి విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో నలుగురు సిబ్బంది ఉంటారు. వారిలో 91 మంది భారతీయులు, 49 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో 71 మంది పురుషులు, 56 మంది మహిళలు, తొమ్మిది మంది బాలలు, నలుగురు శిశువులు ఉంటారు.
మధ్యాహ్నం 2.21 గంటలకు సురక్షితంగా కోచి విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయింది. సాంకేతిక సమస్య పరిష్కరించిన తర్వాత సదరు విమానం సేవలు ప్రారంభం అయ్యాయి. ప్రయాణికులను మరో విమానంలో మాలెకు తీసుకెళ్లినట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు ఇండిగో యాజమాన్యం క్షమాపణ చెప్పింది. ఇక మధ్యాహ్నం 2.05 గంటలకు విమానాశ్రయ పరిధిలో ఎమర్జెన్సీ ప్రకటించామని, 2.21 గంటలకు విజయవంతంగా విమానం ల్యాండయిందని కోచి విమానాశ్రయ అధికారులు తెలిపారు. తిరిగి 2.28 గంటలకు ఎమర్జెన్సీ ఎత్తేశామని చెప్పారు.