indiGo | ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై పౌర విమానయాన మంత్రిత్వశాఖ కొరడా ఝుళిపించింది. కంపెనీ ప్రస్తుతం నడుపుతున్న విమానాల్లో 10శాతం తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. క్రూ రోస్టర్ ఇంటర్నల్ మిస్మేనేజ్మెంట్లో, విమానాల షెడ్యూల్, కమ్యూనికేషన్స్‌లో లోపాల నేపథ్యంలో వారానికిపైగా ప్రయాణికులు తీవ్రంగా అసౌకర్యానికి గురయ్యారు. ఈ క్రమంలో పౌర విమానయాన మంత్రిత్వశాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌లైన్ కార్యకలాపాలు స్థిరీకరించడం, విమానాల రద్దును నివారించేందుకు కోతలు విధించడం అవసరమని మంత్రిత్వశాఖ భావిస్తున్నది. అయితే, ఈ తగ్గింపు ఉన్నప్పటికీ.. ఇండిగో ప్రస్తుతం అన్ని గమ్యస్థానాలకు విమానాలను నడుపుతూనే ఉంటుంది. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను మంగళవారం విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పిలిపించారు. పరిస్థితిని స్థిరీకరించేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆయన అప్డేట్స్ను అందించారు.
డిసెంబర్ 6 నాటికి ప్రభావిత విమానాలకు సంబంధించిన వందశాతం రీఫండ్స్‌ను ప్రాసెస్ చేసినట్లు సీఈవో ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ఇండిగోలో తలెత్తిన సంక్షోభానికి క్షమాపణలు కోరారు. మిగతా రీఫండ్స్‌ను ప్రాసెస్ చేసేందుకు, ప్రయాణికుల లగేజీని వీలైనంత త్వరగా తిరిగి ఇచ్చేందుకు మంత్రిత్వశాఖ కఠినమైన సూచనలు చేసింది. ఛార్జీల పరిమితులు, ప్రయాణికులకు సౌకర్యాలతో సహా అన్ని మంత్రిత్వశాఖ అదేశాలను మినహాయింపు లేకుండా పాటించాలని ఆదేశించింది. అయితే, డీజీసీఏ ఇప్పటికే షెడ్యూల్లోని విమానాలపై 5శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎయిర్‌లైన్ కంపెనీకి సమాచారం ఇచ్చింది. తాజాగా మంత్రిత్వశాఖ అదనంగా మరో 10శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇండిగో రోజువారీగా 2200పైగా విమానాలను నడుపుతున్నది. కోతతో 216 విమానాలను రద్దు చేయాల్సి ఉంటుంది. అయితే, పదిశాతం కోత విధించినా ఇండిగో అన్ని గమ్యస్థానాలకు మునుపటిలాగే విమానాలను నడుపుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.