IndiGo flights : ఇండిగో విమానాల (IndiGo flights) రద్దు సమస్య పూర్తిగా తొలగిపోలేదు. ఇవాళ కూడా పలు ఎయిర్‌పోర్టుల (Airports) లో ఆ సంస్థ విమానాల రద్దు కొనసాగుతోంది. ముంబై నుంచి కోల్‌కతా, నాగ్‌పుర్, భోపాల్ వెళ్లే మూడు విమానాలు నిలిచిపోయాయి. మరోవైపు శ్రీనగర్ (Srinagar) నుంచి అమృత్సర్ (Amritsir) కు వెళ్లాల్సిన రెండు విమానాలు, తిరుచ్చిలో ఐదు అరైవల్స్, ఆరు డొమెస్టిక్ డిపార్చర్ విమానాలను కూడా ఇండిగో రద్దుచేసింది.
తిరువనంతపురం, ఢిల్లీ ఎయిర్‌పోర్టుల నుంచి కూడా ఆ విమానాలు రద్దయ్యాయి. బెంగళూరులో 76 అరైవల్స్, 74 డిపార్చర్లు కలిపి 150 విమానాలు నిలిచిపోయాయి. ఇక హైదరాబాద్‌లో ఏకంగా 100కు పైగా విమానాలు ఆగిపోయాయి. రైల్వే శాఖ ముంబై ఎయిర్‌పోర్టులో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. ఇది ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు, టికెట్ బుకింగ్స్‌లో సాయం చేస్తోంది.
ఇవాళ దాదాపు 1500 విమాన సర్వీసులు నడపనున్నట్లు ఇండిగో అంచనావేసింది. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ రంగంలోకి దిగి సంక్షోభ నివారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసింది. మరోవైపు డీజీసీఏ కూడా విమానాల సంక్షోభ వ్యవహారాన్ని ఇప్పటికే చాలా సీరియస్‌గా తీసుకుంది. సీఈవో, సీవోవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్బెర్స్ తన విధి నిర్వహణలో విఫలమైనట్లు పేర్కొంది.
ఆ సంస్థ ప్లానింగ్‌లో కూడా వైఫల్యం చెందినట్లు డీజీసీఏ అభిప్రాయపడింది. మరోవైపు రవాణ, పర్యాటక రంగంపై పనిచేస్తున్న పార్లమెంటరీ కమిటీ కూడా ఇండిగో సహా ఇతర ఎయిర్‌లైన్స్‌కు సమన్లు జారీ చేయనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఇతర సంస్థలు ఒక్కసారిగా ధరలు పెంచి ప్రయాణికులపై భారం మోపడంపై ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.