IndiGo : దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ సంస్థకు చెందిన విమానంలో ప్రయాణికుడిపై వేడి కూర పడటంతో.. బాధితుడు వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించాడు. దానిపై విచారించిన ఫోరమ్ ఇండిగోకు రూ.25 వేల జరిమానా విధించింది. 2024 మార్చిలో ప్రయాణికుడిపై వేడి కూరపడిన ఈ ఘటన జరిగింది.
2024 మార్చి 5న బ్యాంకాక్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఇండిగో విమానంలో సిబ్బంది ఫుడ్ సర్వ్ చేస్తున్న సమయంలో వేడికూర ఓ ప్రయాణికుడిపై పడింది. దాంతో ఆయన దుస్తులు పాడయ్యాయి. వెంటనే సిబ్బంది క్షమాపణలు తెలిపారు. విషయం తెలిసిన విమానయాన సంస్థ పరిహారంగా రూ.5 వేల ట్రావెల్ వోచర్‌ను ఆఫర్ చేసింది. ఆయన దాన్ని తిరస్కరించారు.
వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ‘వేడి కూర నాపై పడటంతో శరీరం కాలింది. నేను శాఖాహారిని. మాంసాహారం మీద పడటంతో ఆ వాసన భరించలేకపోయాను. నా దుస్తులు, ఫోన్, వాచ్ అన్నీ పాడయ్యాయి. తోటి వారి ముందు నవ్వులపాలయ్యా. విమానం దిగేంత వరకు మానసిక వేదన అనుభవించా. సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇదంతా జరిగింది’ అని ఆ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తంచేశారు.
ఇందుకుగానూ విమానయాన సంస్థ నుంచి రూ.5 లక్షల పరిహారం కావాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బాధితుడికి రూ.20 వేలు చెల్లించాలని, పిటిషన్ ఖర్చుల నిమిత్తం మరో రూ.5 వేలు ఇవ్వాలని ఇండిగోను ఆదేశించింది.