IndiGo flight : దుబాయ్ (Dubai) నుంచి మంగుళూరు (Mangaluru) బయలుదేరిన ఇండిగో విమానం (IndiGo Flight 6E 1468) కు ముందుగా బాంబు బెదిరింపు వచ్చింది. ఆ తర్వాత ల్యాండింగ్ సమయంలో ప్రతికూల వాతావరణం ఎదురైంది. దాంతో అధికారులు ఆ విమానాన్ని దారిమళ్లించారు. ఆదివారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి మంగళూరుకు వెళ్లాల్సిన ఇండిగో విమానం బాత్రూంలో బాంబు బెదిరింపు సందేశాలు ఉండటాన్ని ప్రయాణికులు గుర్తించారు.
వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో విమానాశ్రయ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేయించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అది ఆకతాయిల బెదిరింపుగా అధికారులు ధ్రువీకరించారు. ఆ తర్వాత విమాన ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:25 గంటలకు బయలుదేరాల్సిన విమానం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరింది.
మంగళూరు ఎయిర్‌పోర్టులో విమానాన్ని ల్యాండ్ చేసే సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడి అధికారులు విమానం ల్యాండింగ్‌కు అనుమతించలేదు. దాంతో విమానాన్ని బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. బెంగళూరులో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 169 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అంతరాయానికి తాము చింతిస్తున్నామని ఇండిగో ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది. బాంబు బెదిరింపు ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఇండిగో పేర్కొంది.